జైల్లో ఇమ్రాన్ ఖాన్ కు సకల భోగాలు.. చిట్టా మామూలుగా లేదుగా...!

జైల్లో ఇమ్రాన్ ఖాన్ కు సకల భోగాలు.. చిట్టా మామూలుగా లేదుగా...!

తోషాఖానా అవినీతి కేసులో జైల్లో ఉచలు లెక్కిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్‌- ఇ -ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ కు నెయ్యితో వండిన దేశీయ చికెన్ వడ్డిస్తున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఉంటున్న అటాక్ డిస్ట్రిక్ జైలులో ఆయనకు దేశీ చికెన్ తో పాటు మటన్ కూడా వడ్డిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి హోదాలో జైలు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ సుప్రీంకోర్టుకు నివేదించింది. జైలులో ఇమ్రాన్ జీవన స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరిన తర్వాత జైలు అధికారుల తరపున అటార్నీ జనరల్ కార్యాలయం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించడంతో ఈ విషయం తెలిసింది. 

జైలులో అత్యంత సురక్షితమైన హై అబ్జర్వేషన్ బ్లాక్‌ నంబరు2లో ఇమ్రాన్ ఖాన్ ను ఉంచారు. ఇమ్రాన్ ఉండే సెల్ లో సిమెంట్ తో  ఫ్లోరింగ్ చేసి,  ఒక సీలింగ్ ఫ్యాన్‌ను కూడా ఏర్పాటు చేశారట. ఇమ్రాన్ ఉపయోగించే వాష్‌రూమ్‌ను పెద్దగా చేశారు. అంతేకాదు బ్రాతూమ్  గోడను ఐదు అడుగుల వరకు పెంచారట. దానికి ఫైబర్ డోర్‌ను ఏర్పాటు చేశారు. ఫేస్ వాష్ కోసం పెద్దగా కనిపించే గ్లాస్‌తో కూడిన వాష్ బేసిన్ ఏర్పాటు చేశారు. 

ఇవే కాకుండా.. షవర్, టిష్యూ స్టాండ్, స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాప్‌ను ఏర్పాటు చేశారని సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. ఒక మంచం, నాలుగు దిండ్లు, టేబుల్, కుర్చీ, ప్రార్థన చేసుకోవడానికి ఒక చాప, ఎయిర్ కూలర్ ఇచ్చారు. అలాగే ప్రతిరోజూ ఉదయం చదువుకునేందుకు వార్తాపత్రికలతో పాటు ఇస్లామిక్ చరిత్ర పుస్తకాలు, ఖురాన్ మెటీరియల్ కూడా అందించారు. 

ఇమ్రాన్ అభ్యర్థన మేరకు వారానికి రెండుసార్లు నెయ్యితో వండిన దేశీ చికెన్‌ను వడ్డిస్తున్నారు. మాజీ ప్రధానిని జాగ్రత్తగా చూసుకునేందుకు దాదాపు 53 మంది జైలు సిబ్బందిని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ఆగస్టు 5వ తేదీన పాకిస్తాన్ జిల్లా సెషన్స్ కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తోషాఖానా కేసులో దోషిగా తేలిన వెంటనే లాహోర్‌లోని జమాన్ పార్క్ నివాసం నుండి ఇమ్రాన్ ఖాన్ ను బలవంతంగా తీసుకెళ్లారు. 

అటాక్ డిస్ట్రిక్ జైల్లో నరకం చూపిస్తున్నారని, ఎలాంటి సౌకర్యాలూ కల్పించడం లేదని చాలా సందర్భాల్లో ఇమ్రాన్ తరపున లాయర్‌లు వాదించారు. హత్యలు, అత్యాచారాలు చేసిన నేరస్తుడి మాదిరిగా ట్రీట్ చేస్తున్నారని పీటీఐ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వివాదాస్పదంకావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఇమ్రాన్‌ ఖాన్‌ ఉంటున్న జైల్లో ఆయనకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 

ప్రస్తుతానికి పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీ రద్దైంది. ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్‌ బాధ్యతలు తీసుకున్నారు. కానీ...అధికారం అంతా సైన్యం చేతుల్లోనే ఉంది. ఇమ్రాన్ ఖాన్‌పై పాక్ సైన్యం కుట్రపన్ని ఇలా జైలుపాలు చేసిందని PTI నేతలు ఆరోపిస్తున్నారు.