ఎట్టకేలకు డిండికి లైన్ క్లియర్

ఎట్టకేలకు డిండికి  లైన్ క్లియర్
  •  ఏదుల నుంచి లిఫ్ట్​ స్కీంకు నీళ్లు
  • రాష్ట్ర ఇరిగేషన్​ శాఖ ఆమోదం
  • రూ.1875 కోట్లతో ప్రపోజల్స్​ రెడీ
  • ఎంపీ ఎన్నికలయ్యాక టెండర్లు 

నల్గొండ, వెలుగు: డిండి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీంకు ఎట్టకేలకు మోక్షం లభించింది. పదేండ్లుగా బీఆర్ఎస్​ సర్కార్​ నిర్లక్ష్యం చేసిన ఈ  స్కీంకు కాంగ్రెస్​ ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. ఇటీవల హైదరాబాద్​లో ఇరిగేషన్​మినిస్టర్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్​లో డిండి స్కీంకు పరిష్కారం దొరికింది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల నుంచి డిండి ప్రాజెక్ట్​కు నీళ్లు తరలించాలని డిసైడ్​ చేశారు.

ఇందుకోసం రూ.1,875 కోట్లు ఖర్చువుతాయని అధికారులు అంచనా వేసి, ప్రభుత్వానికి పంపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిపాలన, టెక్నికల్ ఆమోదం ఇచ్చి టెండర్లు పిలిచే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే రెండేళ్లలో డిండి ప్రాజెక్టు పూర్తికానుంది. 

నీళ్లపై క్లారిటీ లేకుండానే రిజర్వాయర్లు కట్టారు 

డిండి లిఫ్ట్​ స్కీంకు నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలనే క్లారిటీ లేకుండా, పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే గత ప్రభుత్వం వేల కోట్లతో తొమ్మిది రిజర్వాయర్ల పనులు చేపట్టింది. వీటి నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే రిజర్వాయర్లు కట్టారంటూ ఏపీ సర్కార్ ఎన్జీటీకి ఫిర్యాదు చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే నీటి కేటాయింపులపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలి. పొల్యూషన్ కంట్రోల్​ బోర్డు ద్వారా ప్రజాభి ప్రాయసేకరణ చేపట్టాలి.  ఆ తర్వాత కేంద్ర జలశక్తి, పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు పొందాలి. ఈ ప్రక్రియను పక్కన పెట్టి, ఏ అనుమతులు లేకుండా రిజర్వాయర్లను కట్టడంతో ప్రాజెక్టు భవిష్యత్​ప్రశ్నార్థకంగా మారింది. 

ఏదుల నుంచే డిండికి నీళ్లు...

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్​ ప్రభావిత ప్రాంతంలోని 3.5లక్షల ఎకరాలకు శ్రీశైలం నుంచి 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించేందుకు డిండి ప్రాజెక్టు చేపట్టారు. అయితే ఎక్కడి నుంచి నీళ్లు తరలించాలనే అంశంపై ఇరిగేషన్​ ఆఫీసర్లు, జిల్లా బీఆర్​ఎస్​ నేతలు, రిటైర్డ్​ ఇంజినీర్ల ఫోరం ప్రతినిధులతో కేసీఆర్​ ఏళ్ల తరబడి చర్చించారే తప్ప ఎటూ తేల్చలేదు. ఏదుల నుంచి గ్రావిటీ ద్వారా డిండి లిఫ్ట్​ స్కీంకు నీళ్లు తెచ్చే సులువైన మార్గం ఉన్నప్పటికీ వట్టెం రిజర్వాయర్​పేరిట మెలిక పెట్టింది. 

దీని వల్ల ఏడాదికి రూ.235 కోట్ల కరెంట్​ బిల్లులు వృథా అవుతాయని ఇంజినీర్లు మొత్తుకున్నా అప్పటి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తెలంగాణ రిటైర్డ్​ ఇంజనీర్ల ఫోరం కూడా ఏదుల నే ప్రపోజ్​ చేసింది. కేసీఆర్​ తేల్చకపోవడం, ఎన్​జీటీ సమస్యతో అడుగు ముందుకు పడలేదు. చివరికి కాంగ్రెస్​ ప్రభుత్వం ఏదుల నుంచే నీళ్లు తరలించాలని డిసైడ్​ చేసింది. 

 నీటి తరలింపు ఇలా...

ఏదుల రిజర్వాయర్​ నుంచి ప్రతిరోజు 0.5 టీఎంసీ చొప్పున నీటిని డిండి లిఫ్ట్​ స్కీంకు తరలిస్తారు. ఇందుకోసం 16 కిలోమీటర్ల టన్నెల్ తవ్వుతారు. ఇంకో పది కిలోమీటర్ల పరిధిలో కాలువలు, వాగులు నిర్మిస్తారు. ఏదుల నుంచి వచ్చేనీటిని డిండి సమీపంలోని పోతిరెడ్డిపల్లి వద్ద వదిలిపెడ్తారు. అక్కడ డిండివాగు మీద డైవర్షన్​ స్ట్రక్చర్​ నిర్మిస్తారు. ఉల్పర దగ్గర ఇప్పటికే కెనాల్​ తవ్వారు. దాన్ని వృథా చేయకుండా పోతిరెడ్డిపల్లి నుంచి ఉల్పర వరకు మరొక కెనాల్​ తవ్వాల్సి ఉంటుంది. ఈ కాల్వల ద్వారానే డిండి స్కీం దిగువ భాగంలో నిర్మిస్తున్న తొమ్మిది రిజ ర్వాయర్లకు నీటిని వదిలిపెడ్తారు.