శాన్ సాల్వెడార్: ఎల్ సాల్వెడార్ దేశంలో దారుణం జరిగింది. ఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరిగి 12 మంది చనిపోయారు. 500 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 100 మంది కండిషన్ సీరియస్ గా ఉంది. ఎల్ సాల్వెడార్ రాజధాని శాన్ సాల్వెడార్ లోని స్టేడియంలో శనివారం రాత్రి ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. లోకల్ టోర్నమెంట్లో భాగంగా అలియాంజ, ఎఫ్ఏఎస్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా, చూసేందుకు వేలాది మంది వచ్చారు. ఆ స్టేడియం కెపాసిటీ 44వేల మంది కాగా, అంతకంటే ఎక్కువమంది వచ్చారు. ఓవైపు మ్యాచ్ మొదలు కాగా, లోపలికి వెళ్లేందుకు ఎంట్రెన్స్ దగ్గర గుమిగూడారు.
అప్పటికే స్టేడియం నిండిపోవడంతో సెక్యూరిటీ గార్డులు గేట్లు మూసేశారు. అయినా, జనం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బారికేడ్లను తొలగించి, గేటు ఓపెన్ చేసి దూసుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. 9 మంది స్పాట్లో చనిపోగా, మరో ముగ్గురు చికిత్స పొందుతూ చనిపోయారని పోలీసులు తెలిపారు. ‘‘500 మందికి పైగా గాయపడ్డారు. వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించాం. 100 మంది పరిస్థితి విషమంగా ఉంది” అని చెప్పారు.
ఫేక్ టికెట్లతో ఎంట్రీ..
కొంతమంది ఫ్యాన్స్ ఫేక్ టికెట్లు కొన్నారని, వాటితో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని పోలీసులు చెప్పారు. ఫేక్ టికెట్లు ఎక్కడివి? ఎవరు అమ్మారు? అనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని దేశాధ్యక్షుడు నయీబ్ బుకెలే తెలిపారు. అందరినీ విచారిస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా, తొక్కిసలాట కారణంగా మ్యాచ్ మొదలైన 16 నిమిషాలకు ఆట ఆపేశారు. తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
