డీఈవో ఆఫీస్‌లో అధికారుల ఇష్టారాజ్యం

డీఈవో ఆఫీస్‌లో అధికారుల ఇష్టారాజ్యం
  • చెప్పాపెట్టకుండా డ్యూటీకి డుమ్మాలు
  •  అటెండెన్స్ రిజిస్టర్‌‌లో దర్జాగా దిద్దుబాట్లు
  • లీవ్ అకౌంట్ వివరాలు నమోదు చేయట్లే

వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి డీఈవో ఆఫీస్‌‌లో అధికారులు, సిబ్బంది సెలవులకు లెక్కాపత్రం లేకుండా పోయింది.  డీఈవో పర్యవేక్షణ లేకపోవడంతో చెప్పాపెట్టకుండా డుమ్మా కొడుతున్నారు.  వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. లేదంటే అటెండెన్స్‌‌ రిజిస్టర్‌‌‌‌లో సీఎల్, ఓడీ, ఈఎల్‌‌తో పాటు ఎంసీఎల్‌‌(మెడికల్ క్యాజువల్ లీవ్‌‌)అని కొత్త పదాన్ని కూడా రాస్తున్నారు. కొందరైతే రూల్స్‌‌ ప్రకారం ఉండాల్సిన దానికంటే ఎక్కువ సీఎల్స్‌‌ తీసుకుంటున్నారు. ఎవరైనా గుర్తిస్తే  సీఎల్స్‌‌ను ఓడీ (ఆన్ డ్యూటీ) గా దిద్దుకొని సంతకాలు పెడుతున్నారు.  ప్రతినెలా తప్పనిసరిగా వేయాల్సిన లీవ్ అకౌంట్ వివరాల కాలాన్ని మాత్రం ఖాళీగా వదిలేస్తున్నారు.  ఈ వివరాలు సర్వీస్ బుక్‌‌లో ఎంట్రీ చేయకుండానే పుల్ జీతం తీసుకుంటున్నారు.  

డీఈవో పర్యవేక్షణ లేకపోవడంతో..

వనపర్తి డీఈవో ఆఫీస్‌‌లో రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు మొత్తం కలిపి 20 మందికి పైగా పనిచేస్తున్నారు. వనపర్తి డీఈవో రవీందర్‌‌‌‌కు  జిల్లాతో పాటు మహబూబ్ నగర్ ఇన్‌‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఈయన సొంత గ్రామం మహబూబ్ నగర్ కావడంతో అక్కడే ఎక్కువగా ఉంటున్నారు.  వనపర్తికి ఎప్పుడో చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారు. ఈయనతో పాటు వనపర్తి డీఈవో ఆఫీస్‌‌లో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ), సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ తదితర ఉద్యోగులు కూడా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వాళ్లు ఇష్టం వచ్చినట్లు డ్యూటీకి రావడమే కాదు కింది స్థాయి సిబ్బందిపైనా పర్యవేక్షణ కొరవడింది.  

15 సీఎల్స్‌‌ ఉంటే 22 తీసుకున్న ఇన్‌‌చార్జి ఏడీ

ఆఫీస్‌‌ ఏడీ నరహరి రిజిస్టర్‌‌‌‌లో బోగస్ లీవ్‌‌లు పెట్టి.. పుల్‌‌ జీతం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మీడియాలో ఆధారాలతో సహా కథనాలు వచ్చాయి.  ప్రస్తుతం ఈయన సెలవులో ఉండడంతో సూపరింటెండెంట్ రవీంద్రాచారికి ఇన్‌‌చార్జి ఏడీగా బాధ్యతలు అప్పగించారు.  ఇక్కడే సీనియర్ అసిస్టెంట్‌‌గా పనిచేసిన ప్రమోషన్ పై సూపరింటెండెంట్ అయిన ఈయన కూడా మహబూబ్ నగర్ నుంచే రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇంకేముంది డ్యూటీకి డుమ్మాలు కొట్టి సీఎల్స్‌‌, ఓడీ అంటూ రిజిస్టర్‌‌‌‌లో రాస్తున్నారు.  రూల్స్‌‌ ప్రకారం ఏడాదికి 15 సీఎల్స్‌‌ ఉంటే.. సెప్టెంబర్ నాటికే 22 సీఎల్స్ వేసుకున్నారు.  కొన్ని సీఎల్స్‌‌ను ఓడీగా దిద్దడం, మరోచోట ఈఎల్‌‌, ఇంకోచోట ఎంసీఎల్.. ఇలా ఇష్టమొచ్చినట్లు రాశారు. 

ఆఫీస్ అవినీతిపై నో ఎంక్వైరీ...

డీఈవో ఆఫీస్‌‌లో జరుగుతున్న అక్రమాలను కలెక్టర్‌‌‌‌ గాని, విద్యాశాఖ ఉన్నతాధికారులు గాని పట్టించుకోవడం లేదు. డీఈవో రవీందర్ రూల్స్ కు విరుద్ధంగా కమీషన్లు తీసుకొని ఆఫ్ లైన్ లో ప్రైవేట్ స్కూళ్లకు రెన్యూవల్స్ చేయడం, సర్కారు కారును  సొంత అవసరాలకు వాడుకోవడం, రూల్స్‌‌ పాటించకుండా చిత్తు పేపర్లు అమ్ముకోవడం,  పైరవీలు చేసుకున్న టీచర్లను డిప్యూటేషన్లు వేయడం, బాలభవన్‌‌ నిధులు పక్కదారి పట్టడం లాంటి ఎన్నో ఆరోపణలు వెలుగులోకి వచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. అలాగే  ఓ  సీనియర్ అసిస్టెంట్  ప్రైవేట్‌‌ స్కూళ్లకు రూ.600కు  ఇవ్వాల్సిన టీసీ బుక్స్‌‌కు  రూ. 3 వేల నుంచి రూ.5వేలు అమ్మినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.   ఈ విషయమై డీఈవో రవీందర్ ను వివరణ కోరగా స్పందించేందుకు నిరాకరించారు.