ఇంటికో ఉద్యోగమన్నరు.. ఊరికొక్కటి కూడా ఇయ్యలే

ఇంటికో ఉద్యోగమన్నరు.. ఊరికొక్కటి కూడా ఇయ్యలే

ఉద్యోగాల్లేక  నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నరు 

ఖాళీలు భర్తీ చేయాలంటూ  ఆర్. కృష్ణయ్య, కోదండరాం డిమాండ్

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ఎన్నికల సభల్లో  ఇంటికో ఉద్యోగమని చెప్పి…కనీసం ఊరికొక జాబ్ కూడా ఇవ్వటం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌‌. కృష్ణయ్య, టీజేఎస్‌‌ చీఫ్‌‌ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్స్ లేక నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌‌లోని బీసీ భవన్‌‌లో ఆర్‌‌. కృష్ణయ్య,  కోదండరాం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పలు సమస్యలపై చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. జాబ్స్ లేవని ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని…ప్రభుత్వంతో పోరాడి ఉద్యోగాలు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఉద్యోగాల భర్తీలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది ?

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కృష్ణయ్య, కోదండరాం చెప్పారు. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని ప్రశ్నించారు. గ్రూప్-–4 క్లరికల్ ఉద్యోగాలు 40 వేలు,  గ్రూప్-–1లో 1600-, గ్రూప్–-2 లో 4 వేలు,  గ్రూప్ – 3 లో 8 వేల ఉద్యోగాలు భర్తీ చేయలని వారు డిమాండ్ చేశారు. గత ఆరేళ్లలో 40 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని ఆ పోస్టులను కూడా రిక్రూట్ చేస్తలేరన్నారు. రిటైర్ మెంట్లతో ఖాళీ అయిన పోస్టులకు అదనపు బడ్జెట్ కూడా అవసరం లేదని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యూత్ ను సీఎం కేసీఆర్ మోసం చేస్తుండని మండిపడ్డారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ,  ప్రధాన కార్యదర్శి కోలా జనార్ధన్, శ్రీశైలం రెడ్డి, ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.