అటల్ సేతుపై బండ్లు ఆపితే కఠిన చర్యలు

అటల్ సేతుపై బండ్లు  ఆపితే కఠిన చర్యలు

ముంబై :  దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతుపై వెహికల్స్ ఆపితే కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.  అటల్ సేతు పిక్నిక్ స్పాట్ కాదని  స్పష్టం చేశారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవశేవాను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయితే, దీనిపై వెళ్లే వాహనదారుల వ్యవహారశైలి ఇబ్బందికరంగా మారింది. కొందరు బ్రిడ్జి  మధ్యలో వెహికల్ ఆపి సెల్ఫీలు తీసుకొంటున్నారు. మరికొందరు అక్కడి రెయిలింగ్ పైకి ఎక్కి ఫొటోలకు ఫోజులిస్తున్నారు. 

రూల్స్ మరిచిపోయి బ్రిడ్జిపై చెత్త వేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ నేపథ్యంలో  ముంబై పోలీసులు ఎక్స్ ద్వారా స్పందించారు. "అటల్ సేతు చూడదగ్గ ప్రదేశమేనని అంగీకరిస్తం. కానీ, బ్రిడ్జి మధ్యలో ఆగి ఫొటోలు తీసుకోవడం చట్ట విరుద్ధం. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్​పై ఆగినట్లు తేలితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తుంది. 

అటల్ సేతు 21.8 కి.మీ. పొడవైన పిక్నిక్ స్పాట్ కాదు"  అని ట్వీట్ చేశారు. సేవ్రీ, నవశేవా మధ్య దూరాన్ని అటల్ సేతు గంటన్నర నుంచి 20 నిమిషాలకు తగ్గించింది. కాగా, సెంట్రల్ ముంబైలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. పరేల్ వద్ద ఉన్న బ్రిడ్జిపై వెళ్తున్న టిప్పర్​ను ఓ బైక్ ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో  ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మరణించారు.