మార్కెట్లోకి ఏథర్ కొత్త కోనార్క్ ఈవీ స్కూటర్.. రూ.లక్షకే 100 కి.మీ రేంజ్

మార్కెట్లోకి ఏథర్ కొత్త కోనార్క్ ఈవీ స్కూటర్.. రూ.లక్షకే 100 కి.మీ రేంజ్

ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరతీస్తూ ఈవీ టూవీలర్ దిగ్గజం ఏథర్ ఎనర్జీ. తన సరికొత్త మాస్-మార్కెట్ స్కూటర్ 'ఏథర్ కోనార్క్'ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. చెన్నైలో జరిగిన వార్షిక 'ఏథర్ కమ్యూనిటీ డే 2025/2026' వేదికగా కంపెనీ సీఈఓ తరుణ్ మెహతా ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేశారు. కేవలం ఎర్లీ అడాప్టర్లకే పరిమితం కాకుండా.. సామాన్య మధ్యతరగతి కుటుంబాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు.

ఈ కొత్త కోనార్క్ స్కూటర్‌ ధరను రూ. 99వేల 999 నుంచి నిర్ణయించింది. ఇది వివిధ రేంజ్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఇందులో 100 కి.మీ రేంజ్ వేరియంట్ ధర రూ. 99వేల 999 కాగా, 125 కి.మీ రేంజ్ వేరియంట్ ధర రూ.లక్షా 21వేల 999గా ఉంది. ఈ రెండు వేరియంట్లు సెప్టెంబర్ 2026 నుంచే విక్రయాలకు రానున్నాయి. వీటితో పాటు 161 కి.మీ రేంజ్ వెర్షన్‌ను రూ. లక్షా 44వేల 999 ధరకు, అలాగే 200 కి.మీ రేంజ్ ఇచ్చే కోనార్క్ మోడల్‌ను 2027 మూడో త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు ఏథర్ ప్రకటించింది.

ఏథర్ అభివృద్ధి చేసిన సరికొత్త EL ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న మొదటి ప్రొడక్షన్ స్కూటర్ ఇదే. భవిష్యత్తులో వివిధ సెగ్మెంట్లలో కంపెనీ తెచ్చే ఉత్పత్తులకు ఈ ప్లాట్‌ఫామ్ వెన్నెముకగా నిలవనుంది. స్పోర్టియర్ 450 సిరీస్‌కు భిన్నంగా.. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరింత సాంప్రదాయ, కంఫర్టబుల్ డిజైన్‌తో కోనార్క్‌ను తీర్చిదిద్దారు. ఇది టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి ప్రముఖ బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మారిన కాలానికి అనుగుణంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ మెయిన్‌స్ట్రీమ్‌లోకి అడుగుపెడుతోందని తరుణ్ మెహతా తెలిపారు. రీసేల్ విలువ, సర్వీసింగ్ సమయం, చెడ్డ రోడ్లపై సౌకర్యం, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అంశాలపై కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకునే ఈ ఎల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. కేవలం కోనార్క్ మాత్రమే కాకుండా.. 2027 రెండో త్రైమాసికంలో 'కోనార్క్ జెడ్' మోడల్‌ను కూడా తీసుకురానున్నట్లు కంపెనీ తన రోడ్‌మ్యాప్‌లో స్పష్టం చేసింది.

భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా ఉన్న ఈ కోనార్క్ స్కూటర్, మిడిల్ క్లాస్ బడ్జెట్ బైకర్లకు పర్ఫెక్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. అత్యాధునిక టెక్నాలజీ, మెరుగైన బ్యాటరీ రేంజ్, ఆకర్షణీయమైన ధరతో వస్తున్న ఈ స్కూటర్ ఏథర్ గ్రోత్ జర్నీలో కీలకంగా మారుతుందని ఆటో నిపుణులు అంటున్నారు.