దివ్యాంగులైన సైనికుల కోసం ఆత్మనిర్భర్​ రన్​

దివ్యాంగులైన సైనికుల కోసం ఆత్మనిర్భర్​ రన్​
  • ఫండ్ క్యాంపెయినింగ్ చేస్తున్న రిటైర్డ్ సోల్జర్ కుమార్ అజ్వానీ (61)

మనసులో బలమైన సంకల్పం ఉంటే... శరీరం సహకరిస్తుందని నిరూపించాడు  61 ఏండ్ల కుమార్​ అజ్వాని. జమ్మూ కాశ్మీర్​కు చెందిన ఈ రిటైర్డ్​​ సోల్జర్​ తనలాంటి సోల్జర్స్​ బాగు కోసం పాటు పడుతున్నాడు. యుద్ధంలో కాళ్లు, చేతులు కోల్పోయి దివ్యాంగులుగా మారిన సైనికుల బాగు కోసం కృషి చేస్తున్నాడు. వాళ్లను ఆర్థికంగా ఆదుకోవడం కోసం క్యాంపెయినింగ్​ మొదలు పెట్టాడు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకూ ‘ఆత్మనిర్భర్​ రన్’ పేరుతో రన్ చేస్తూ ఫండ్​ క్యాంపెయినింగ్​ చేస్తున్నాడు. ఈ ఫండ్​ను దివ్యాంగులైన సోల్జర్స్​కు అందించాలి అనుకుంటున్నాడు. 
అజ్వానీది జమ్మూలోని ఉధంపూర్​ జిల్లా.మాజీ సోల్జర్​. ఆర్మీ స్పోక్స్​ పర్సన్​ గా కూడా పని చేశాడు.

యుద్ధాల్లో కాళ్లు చేతులు కోల్పోయి మంచాన పడ్డ సైనికులను కళ్లారా చూశాడు. వారి కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకున్నవాడు. ఈ పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగ సైనికులకు సాయం చేయాలని, వారి పిల్లలకు చదువులు చెప్పించాలని తపించాడు. కేవలం జమ్మూ కాశ్మీర్​లోనే కాదు. దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ సోల్జర్స్​కు సాయం చేసి, వాళ్లలో మానసిక ధైర్యం నింపాలనుకున్నాడు.  వారి పిల్లల బాగోగుల గురించి ఆలోచించాడు. అందుకే ‘ఆత్మనిర్భర్​ రన్​’ను మొదలు పెట్టాడు. నవంబర్ 19న ఉధంపూర్ జిల్లాలోని పట్నిటాప్ హిల్ రిసార్ట్ నుంచి పరుగు మొదలుపెట్టాడు.

జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 
76 రోజుల్లో 4,444 కిలోమీటర్ల దూరాన్ని చేరుకొనే పనిలో ఉన్నాడు. విద్యార్థులకు చదువు, దివ్యాంగ సోల్జర్స్​కు సాయం అందించడమే అజ్వానీ లక్ష్యం. ‘‘ఈ రన్ ద్వారా  వన్​ ఇండియా, యూనిటీ ఇండియా అనే మెసేజ్​ను అందించాలన్నది నా ఆలోచన” అంటున్నాడు. అజ్వానికి టీమ్ ఫ్యాబ్​ ( ఎఫ్​ఏబీ) అనే ఎన్జీఓ కూడా ఉంది. దీని ద్వారా రన్నర్ల ఫిట్‌‌నెస్‌‌ను ప్రోత్సహించడానికి వాళ్లకి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నాడు అజ్వాని.