సముద్ర జీవుల్లో ‘అణు’ ఆనవాళ్లు

సముద్ర జీవుల్లో ‘అణు’ ఆనవాళ్లు

సముద్రాలకు మనుషుల వల్ల వచ్చిన కష్టాలు చాలవన్నట్టు కొత్త సమస్య వచ్చి పడింది. చెప్పాలంటే ఇది కొత్తది కాదు.. మన సైంటిస్టులే ఇప్పటిదాకా దాన్ని గుర్తించలేకపోయారనడం సబబు. భూమ్మీదున్న సువిశాల మహా సముద్రాల్లో బతికే జీవుల్లో న్యూక్లియర్ పరీక్షలకు సంబంధించిన ఐసోటోపులు ఉన్నాయట. మామూలుగా సముద్రాల లోతు 6.5 కిలోమీటర్లు దాటిన తర్వాత అతి తక్కువ వేడి, ఎక్కువ ఒత్తిడి, తక్కువ ఆహార లభ్యత ఉంటాయి. అందుకే సాధారణ జీవులు కనిపించవు. ఇక్కడ కేవలం యాంఫీపాడ్స్ అనే చిన్ని చిన్ని జీవులు మాత్రమే బతకగలవు. మన సైంటిస్టులు అణు ఐసోటోపులను గుర్తించింది యాంఫీపాడ్స్ లోనే. యండ్రకాయలు, రొయ్యల కుటుంబానికి చెందినవే యాంఫీపాడ్స్. సైజులో చాలా చిన్నవిగా ఉంటాయి. చనిపోయిన చెట్లు, జంతువులను తింటూ సముద్రాన్ని క్లీన్ చేస్తుంటాయి. అమెరికా మసాచుసెట్స్‌లో ఉన్న వుడ్స్ హోల్ ఓషనోగ్రఫిక్ ఇనిస్టిట్యూషన్(డబ్ల్యూహెచ్ఓఐ)కు చెందిన ఓషనోగ్రాఫర్లు కార్బన్‌ ఐసోటోపులను తింటున్నాయని తేల్చారు. యాంఫీపాడ్స్ అణు పదార్థాలను తీసుకుంటున్నాయన్న చైనా సైంటిస్టుల మాటను నిర్ధారించారు.  ముఖ్యంగా కార్బన్–14 అనే ఐసోటోపు టార్గెట్ గా వీళ్ల పరిశోధన సాగింది. పసిఫిక్ మహా సముద్రంలోని మూడు ట్రెంచుల్లో ఈ ఐసోటోపు ఆనవాళ్లు దొరకడమే ఇందుకు కారణం. 1950 నుంచి 1960 మధ్య జరిగిన అణు పరీక్షల వల్ల గాల్లో చాలా కార్బన్ ఐసోటోపులు కలిశాయి. కొన్ని సముద్రాల అడుగుకు చేరాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు.