మీ కూతురు ఉరేసుకుంది.. భార్య ఫ్యామిలీకి భర్త ఫోన్ .. హైదరాబాద్ ఎల్బీనగర్లో దారుణం

మీ కూతురు ఉరేసుకుంది.. భార్య ఫ్యామిలీకి భర్త ఫోన్ .. హైదరాబాద్ ఎల్బీనగర్లో దారుణం

మూడు ముళ్ల బంధం ముచ్చటగా మూడేళ్లు కూడా సాఫీగా సాగలేదు. కలహాలతో, కలతలతో చివరికి ఆ కాపురం కూలిపోయింది. భార్య, భర్తల మధ్య ఉన్న గొడవలు, అత్తింటి వారి వేధింపులతో ఆ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది.  మీ కూతురు ఉరేసుకుని చనిపోయిందని భార్య ఫ్యామిలీకి భర్త ఫోన్ చేయడం ఇక్కడ పెద్ద ట్విస్టు. ఈ విషాధ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. పెండెం రాజశేఖర్, జాస్మిన్ దంపతులు మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఎల్బీ నగర్ సింహపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉన్నట్లుండి బుధవారం (మే 14) జాస్మిన్ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోవడం కలకలం రేపింది. జాస్మిన్ చనిపోయిందని భర్త ఫోన్ చేయడంతో హైదరాబాద్ చేరుకున్నారు ఆమె తల్లిదండ్రులు.

భర్త  వేధింపులు తాళలేక జాస్మిన్ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భర్త  పెండెం రాజశేఖర్, అతని తల్లి వేధింపులే ఆమె మృతికి కారణమని ఎల్బీ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు యువతి తల్లిదండ్రులు. పెళ్ళైన నాటి నుంచి భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని, పిల్లలు పిల్లలు కాలేదనే మనస్థాపంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

రాజశేఖర్ తన భార్య జాస్మిన్ ను గతంలో అనేక మార్లు ఇబ్బందులకు గురి చేస్తే ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. రాజశేఖర్ పై  కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అలాగే పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడి సర్ది చెప్పి పంపించినా భర్త బుద్ధి మారలేదని జాస్మిన్ పేరెంట్స్ తెలిపారు. 

కూతురు కాపురం బాగుండాలని చాలా సాయం చేశామని, ఇప్పటివరకు చాలా సార్లు డబ్బుల కొట్టినా అతని మనసు మారలేదని చెప్పారు మృతురాలి పేరెంట్స్. తమ కూతురును పొట్టన పెట్టుకున్నారని బోరున విలపించారు. 

మీ కూతురు ఉరేసుకుందని అల్లుడు ఫోన్ చేయడంతో వెంటనే వచ్చి చూస్తే.. కూతురు ఒంటిమీద విపరీతమైన గాయాలు ఉన్నాయని తెలిపారు. చిత్రహింసలు పెట్టడంతో శరీరం అంతా కమిలిపోయి ఉందని, వైరుతో ఉరి వేసి చంపారని జాస్మిన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను చిత్రహింసలు పెట్టీ చంపిన రాజశేఖర్ ను, అతని కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేసి చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మృతురాలి పేరెంట్స్.