అపాయింట్ మెంట్ లేకుండా చూడనన్నందుకు డాక్టర్ పై దాడి

అపాయింట్ మెంట్ లేకుండా చూడనన్నందుకు డాక్టర్ పై దాడి

గువాహటి: మిజోరాం సీఎం జోరంతంగ బిడ్డ మిలారీ చాంగ్టే ఓ ఆస్పత్రిలో ఓవరాక్షన్ చేసింది. అపాయింట్ మెంట్ లేకుండా చూడనన్నందుకు డాక్టర్ పై దాడి చేసింది. ఈ నెల 17న ఆమె ఐజ్వాల్ లోని ఓ క్లినిక్ కు వెళ్లింది. అక్కడి డెర్మటాలజిస్టును కలిసేందుకు వెళ్లగా, అపాయింట్ మెంట్ తీసుకుని రావాలని డాక్టర్ సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన మిలారీ.. డాక్టర్ పై చేయి చేసుకుంది. అక్కడున్న వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టడంతో వైరల్​గా మారింది.

ఈ సంఘటనకు సంబంధించి సీఎం జోరంతంగ కుటుంబంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సీఎం కూతురు దురుసు ప్రవర్తనను నిరసిస్తూ రాష్ట్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లు ఆందోళనలు చేశారు. నల్ల బ్యాడ్జీలతో డ్యూటీలకు హాజరై నిరసన తెలిపారు. ఈ వివాదంపై సీఎం జోరంతంగ స్పందిస్తూ.. సదరు డాక్టర్​కు బహిరంగ క్షమాపణ చెప్పారు. ‘‘నా బిడ్డ అనుచిత ప్రవర్తనకు నేను క్షమాపణలు చెబుతున్నాను. ఆమె ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించను” అని ఆయన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు.