న్యాయవ్యవస్థపై దాడిని సహించొద్దు

న్యాయవ్యవస్థపై  దాడిని సహించొద్దు
  •  సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
  • కొందరు న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడి 
  •  అడ్వకేట్ల లెటర్​పై ప్రధాని మోదీ, కాంగ్రెస్ ​నేత జైరాం రమేశ్ పరస్పర విమర్శలు 

న్యూఢిల్లీ: కొన్ని గ్రూపులు న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు, కోర్టులపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని సుప్రీంకోర్టు లాయర్లు ఆరోపించారు. రాజకీయ ఎజెండాల కోసం కొందరు న్యాయవ్యవస్థపై దాడికి యత్నిస్తున్నారని, దీనిని సహించొద్దని కోరారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థ బలంగా నిలబడాలని సూచించారు. ఈ మేరకు సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌‌‌‌పర్సన్ మనన్ కుమార్ మిశ్రాతో సహా 600 మంది లాయర్లు ఈ నెల 26న సుప్రీంకోర్టు చీఫ్ ​జస్టిస్ డీవై చంద్రచూడ్​కు లేఖ రాశారు. 

ముఖ్యంగా రాజకీయ నాయకుల కేసులలో.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ప్రముఖులకు సంబంధించిన కేసుల్లో వారి ఒత్తిడి వ్యూహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. దీంతో లోక్​సభ ఎన్నికల ముందు వందలాది మంది లాయర్లు ఇలా సీజేఐకి లేఖ రాయడం తీవ్ర దుమారం రేపింది. ఈ లేఖపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ సీనియర్​ నేత జైరాం రమేశ్​ పరస్పరం తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు.  

లేఖలో ఏముందంటే..

కొన్ని స్వార్థ ప్రయోజనాల గ్రూపులు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి  ప్రయత్నిస్తున్నాయని లాయర్లు సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాలు కోర్టుల ప్రతిష్టను దెబ్బతీస్తాయని,  ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు కలిగిస్తాయని తెలిపారు. అలాగే, ఒక వర్గం న్యాయవాదులు పగటిపూట రాజకీయ నాయకులను సమర్థిస్తూ.. రాత్రిపూట మీడియా ద్వారా న్యాయమూర్తులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా అవినీతి ఆరోపణలున్న రాజకీయ ప్రముఖుల కేసులలో ఒత్తిడి వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. పాత రాజకీయ ఎజెండాల ఆధారంగా న్యాయస్థానాల పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ అంశంలో నిశ్శబ్దంగా ఉంటే హాని చేయాలనే ఉద్దేశంలో ఉన్నవారికి మరింత శక్తి లభిస్తుందన్నారు. చాలా ఏండ్లుగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని సీజేఐని లాయర్లు కోరారు. 

లాయర్ల లేఖపై.. మోదీ వర్సెస్ జైరాం 

సీజేఐకి లాయర్ల లేఖపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. కాంగ్రెస్‌‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతరులను బుజ్జగించడం, బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు. ‘‘ఐదు దశాబ్దాల క్రితమే వారు కేంద్రానికి కట్టుబడి ఉండే న్యాయవ్యవస్థ కావాలన్నారు. వారు స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుంచి సిగ్గు లేకుండా నిబద్ధతను కోరుకుంటారు. కానీ, దేశం పట్ల నిబద్ధత చూపించరు. అందుకే 140 కోట్ల మంది భారతీయులు వారిని తిరస్కరిస్తున్నారనడంలో ఆశ్చర్యం లేదు” అని మోదీ  ట్వీట్​ చేశారు. అయితే, మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్​ నేత జైరాం రమేశ్​ ఖండించారు. న్యాయవ్యవస్థపై మోదీ కపట ప్రేమ చూపిస్తున్నారని ఫైర్​ అయ్యారు.

 ఇటీవల ఆయనకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని,  ఎలక్టోరల్ బాండ్ల స్కీం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిందన్నారు. బీజేపీకి విరాళాలు ఇవ్వాలని కంపెనీలను  బ్లాక్‌‌మెయిల్ చేశారని రుజువైందని జైరాం ట్వీట్ చేశారు.  మోదీ ఎంఎస్‌‌పీకి కాకుండా అవినీతికి లీగల్ గ్యారెంటీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. గత పదేండ్లలో ప్రధాని చేసిందంతా విభజించడం, వక్రీకరించడం, దారి మళ్లించడం, పరువు తీయడమేనన్నారు. 140 కోట్ల మంది భారతీయులు త్వరలో ఆయనకు తగిన సమాధానం ఇస్తారన్నారు.