ధర్నా చేస్తున్న విద్యార్థులపై దాడి

ధర్నా చేస్తున్న విద్యార్థులపై దాడి
  • ఫీజులు తగ్గించాలంటే స్టూడెంట్లపై దాడి
  • హెచ్ సీయూలో ధర్నా చేస్తున్న వారిని వీసీ చాంబర్ సెక్యూరిటీ గార్డులు
  • ఈడ్చుకెళ్లడంతో పలువురికి స్వల్పగాయాలు 

గచ్చిబౌలి, వెలుగు : హెచ్​సీయూలో ఫీజులు తగ్గించమని ధర్నా చేస్తున్న స్టూడెంట్లు వీసీ చాంబర్ సెక్యూరిటీ గార్డులు ఈడ్చుకెళ్లడంతో పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండించింది. హెచ్ సీయూలో కామన్ ఎంట్రెన్స్ టెస్టులో క్వాలిఫై అయిన స్టూడెంట్ల నుంచి గతంలో రూ.600 చొప్పున ఫీజు తీసుకునేవారు. కానీ ఈ ఏడాది అప్లికేషన్ ఫీజు పేరుతో సబ్జెక్టుకు రూ.600 చొప్పున వసూలు చేస్తున్నారని.. దీనివల్ల లక్షా 57 వేల మంది స్టూడెంట్లపై భారం పడుతుందని  పేర్కొంటూ శుక్రవారం హెచ్​సీయూ ఎస్ ఎఫ్​ఐ స్టూడెంట్లు వర్సిటీ వీసీ బీజే రావు,​ కంట్రోలర్​ఆఫ్ ఎగ్జామ్స్ అధికారితో చర్చించేందుకు వెళ్లారు.

ఫీజు కట్టలేకపోతే అప్లయ్ చేయొద్దంటూ వారు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటంతో స్టూడెంట్లు వీసీ చాంబర్ ఎదుటే ధర్నా చేపట్టారు. వర్సిటీకి, వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వీసీ చాంబర్ సెక్యూరిటీ ధర్నా చేస్తున్న స్టూడెంట్లను అక్కడి నుంచి ఈడ్చుకెళ్లడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఫీజు తగ్గించాలని ధర్నా చేస్తూ చర్చలు జరపకుండా వీసీ సెక్యూరిటీ సిబ్బందితో దాడి చేయించారని స్టూడెంట్లు ఆరోపించారు. హెచ్​సీయూ స్టూడెంట్లపై జరిగిన దాడిని ఖండించిన రాష్ట్ర ఎస్ఎఫ్ఐ నాయకులు స్టూడెంట్లు పక్షాన పోరాడుతామని తెలిపారు.