కేసీఆర్ పాలనలో దళితులపై దాడులు

కేసీఆర్ పాలనలో దళితులపై దాడులు

ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ కొప్పు భాషా
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పాలనలో దళితులపై నిత్యం దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ కొప్పు భాషా ఆరోపించారు. ఇటీవల నల్గొండ జిల్లాలో దళిత మహిళపై జరిగిన దాడి బాధాకరమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఒరిగింది శూన్యమన్నారు.  ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీల అమలుకు నోచుకోకపోగా, దళితులపై హత్యలు, దాడులు పెరుగుతున్నాయన్నారు.  దళితుల భూములను అధికారపార్టీ లీడర్లు కబ్జా  చేస్తున్నారని, అడ్డువస్తే చంపేస్తున్నారని ఆరోపించారు.  గతంలో మహబూబ్ నగర్ జిల్లాలోని వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఓ దళిత రైతును ఇసుక మాఫియా క్రూరంగా హత్య చేసిందన్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేలలో ఓ దళిత రైతు భూమి ని అభివృద్ధి పేరుమీద ప్రభుత్వం గుంజుకుంటే ఆ రైతు గత్యంతరం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.  దళిత మహిళ శారదపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని  ఆయన డిమాండ్ చేశారు.