న్యూయార్క్: ఇరాన్– అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలతో తమకు సంబంధం లేదని ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ ప్రతినిధి డ్యానీ డానన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన యూఎన్‌లో మాట్లాడుతూ.. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పెంచుకోకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్‌పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని, ఆపరేషన్ ముగిసిన తర్వాత చర్చలు తప్పనిసరిగా ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపరిచామని అన్నారు.
పశ్చిమాసియాలో శాంతికి ఇజ్రాయెల్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఇరాన్ మాత్రం అస్థిరతకు కారణమవుతున్నదని డానన్ ఆరోపించారు. హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ మద్దతు ఇస్తున్నదని ఆరోపించారు. వాళ్లకు ఆయుధాలు అందించడంతోపాటు, నిధులనూ సమకూరుస్తున్నదన్నారు. ప్రస్తుతం తాము దానిని అడ్డుకునే పనిలో ఉన్నామన్నారు. అమెరికా మద్దతుతో ఇరాన్భూభాగంలో 8,500కి పైగా దాడులు చేసినట్టు చెప్పారు.
క్షిపణి కేంద్రాలు, ఆయుధ తయారీ యూనిట్లు, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేశామన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు వారాల తరబడి క్షిపణి దాడుల భయంతో బంకర్లలో ఉంటున్నారని, ఇటీవల అరాద్, డిమోనా నగరాల్లో జనావాసాలపై దాడులు జరిగాయని చెప్పారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఇరాన్ చర్చలు జరుపుతున్నదని, యుద్ధం ముగింపు దశకు చేరుకోవచ్చని అన్నారు. ఇరాన్ నౌకా, వైమానిక దళాలతోపాటు కమ్యూనికేషన్ వ్యవస్థలు దాదాపు నాశనమయ్యాయన్నారు. ఇప్పటికే తాము యుద్ధాన్ని గెలిచామని డానన్ వెల్లడించారు.
