ఫోర్జరీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయాలని చూసిన భారీ కుట్రను చందానగర్ పోలీసులు చేధించారు. అధికారుల కళ్లు గప్పి సామాజిక సంక్షేమ శాఖకు చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే... చందానగర్ గ్రామంలోని సర్వే నెంబర్ 373, 374 ,375లో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన విలువైన స్థలం ఉంది. ఈ స్థలంపై కన్నేసిన నిందితులు అక్కడ అసలు లేని ఇళ్లు ఉన్నట్లుగా నమ్మించేందుకు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారు. నకిలీ GHMC ఇంటి నెంబర్లను సృష్టించి నకిలీ PTIN నెంబర్లను డాక్యుమెంట్లపై ముద్రించారు. చివరికి టెక్నాలజీని ఉపయోగించి ఖాళీ స్థలంలో ఇళ్లు ఉన్నట్లు ఫోటోలను ఫోర్జరీ చేశారు.
ఈ నకిలీ పత్రాల ద్వారా ప్రభుత్వ భూమిపై అక్రమంగా యాజమాన్య హక్కులను క్లెయిమ్ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న సంబంధిత శాఖ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన చందానగర్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి ఈ భారీ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకున్నారు.
ALSO READ : హనుమాన్ జయంతి రోజున గుండెను పిండేసిన వీడియో !
ప్రధాన నిందితుడు నేరుటి నిరంజన్‌తో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై చీటింగ్, ఫోర్జరీ , నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులను రిమాండ్‌కు తరలించిన పోలీసులు ఈ స్కామ్‌లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
