వరుసగా 5 ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం.. ఆరో ప్రయత్నంలో పోలీసులకు చిక్కి కటకటాలకు

వరుసగా 5 ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం..  ఆరో ప్రయత్నంలో పోలీసులకు చిక్కి కటకటాలకు

కర్నూలు: కష్టాల నుండి వెంటనే బయటపడాలంటే.. బాగా డబ్బు సంపాదించాలి… దాని కోసం ఏటీఎంలలో చోరీ చేయడమే బెటర్ అనుకుంటూ.. వరుసగా ఐదు ఏటీఎంలలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు ఆరో ప్రయత్నంలో ఏటీఎం చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించి నాటకీయ ఫక్కీలో పోలీసులకు పట్టుబడ్డారు. కర్నూలు నగరంలో సినీ ఫక్కీలో జరిగిన ఏటీఎం దొంగల విఫలయత్నం ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు నిందితులను కర్నూలు 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

కర్నూలు నగరంలోని సోమిశెట్టినగర్ కు చెందిన చాకలి వేణు (25) సేల్స్ బాయ్ గా పనిచేసేవాడు. కరోనా వచ్చిన తర్వాత ఉద్యోగం పోవడంతో ఖాళీగా ఉంటూ.. కష్టాలు పడ్డాడు. అద్దె ఇంట్లో ఉంటూ అనేక కష్టాలు పడుతున్నా.. వీధిలో అందరూ నాకు ఏ పనీ లేదని… ఉద్యోగం లేదని చులకనగా చూస్తున్నారని మదనపడేవాడు. సొంతిల్లు కట్టుకుని హాయిగా బతకాలంటే బాగా డబ్బులు కావాలి.. ఈ  ఆర్ధిక ఇబ్బందుల నుండి బయయటపడాలంటే ఏటీఎంను చోరీచేయడమే బెటర్ అనుకుంటూ చోరీకి పక్కా గా ప్లాన్ చేసుకున్నాడు. గత ఆగస్టు 25వ తేదీన నంద్యాల రోడ్డులోని శకుంతల కళ్యాణ మండపం వద్ద కెనెరా బ్యాంక్ ఏటీఎంలోకి అర్ధరాత్రి తర్వాత దూరి కరెంట్ కట్టర్ తో ఏటీఎంను పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా ఏటీఎంను బద్దలు కొట్టలేక నిరాశతో వెనుదిరిగాడు. తన ఒక్కడి వల్ల పని కాలేదనుకుని.. మరొకరు సహాయం ఉంటే బాగుంటుందనుకుంటూ.. అమ్మ ఆస్పత్రి దగ్గర కమలా నగర్ కు చెందిన బోయ నగేష్ (22) తో మాటలు కలిపి దారికి తెచ్చుకున్నాడు. తాపీ పనిచేసుకుని జీవిస్తున్న తన కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవని భావించిన నగేష్ కూడా ఏటీఎంల చోరీకి సై అంటూ ఒప్పుకున్నాడు. ఇద్దరం ఉన్నాము కాబట్టి ఈసారి ఏలాగైనా సక్సెస్ ఫుల్ గా చోరీ చేయాల్సిందేనని నిర్ణయించుకున్నారు. గత సెప్టెంబర్ 29వ తేదీన రాత్రి 10 గంటలకు ఒక కొడవలి.. గడ్డపార తీసుకుని..  ఏపీ 21ఏ 9136 నెంబరు గల హీరో హోండా బైకులో బయలుదేరారు.  తమ ఆధారాలు దొరకకుండా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ముందుగా నంద్యాల చెక్ పోస్టు వద్ద కెనెరా బ్యాంక్ ఏటీఎంలోకి దూరి ప్రయత్నించారు. అది వచ్చేటట్లు కనిపించకపోవడంతో అక్కడి నుండి బయలుదేరి టౌన్ లోకి బయలుదేరి వస్తూ.. బిషప్ చర్చి దగ్గరున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎంలో దూరారు. అది కూడా రాకపోయేసరికి సి.క్యాంప్ సెంటర్  వైపు వస్తూ.. 108 వాహనాల సెంటర్ పక్కనున్న ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో దూరారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇహ లాభం లేదనుకుని టౌన్లోకి బయలుదేరి టీడీపీ ఆఫీసు ఎదురుగా గాయత్రి ఎస్టేట్ లో ఉన్న ఆంధ్ర్యాబ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో దూరి దాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తెల్లవారడంతో తమ ప్రయత్నాలు విరమించారు. తమకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకకుండా.. సీసీ కెమెరాలకు చిక్కకుండా ముసుగులు కప్పుకుని జాగ్రత్తపడ్డారు. వరుసగా ఐదు ఐదు ఏటీఎంలలో చోరికి విఫలయత్నం చేసిన వీరు చోరీకి అనువైన ఏటీఎం కోసం రెక్కీలు చేస్తుంటే పోలీసులు నిఘా పెట్టి వెంబడించారు. ఇవాళ మళ్లీ ఆరో ప్రయత్నానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా కర్నూలు 3వ పట్టణ సీఐ ఎండి.తబ్రేజ్, తన సిబ్బంది ప్రసాద్ సింగ్, ఇ.రాము, చంద్రబాబులతో కలసి వల పన్ని పట్టుకున్నారు. నిందితులను త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో మీడియా ఎదుట ప్రవేశపెట్టి వారి ప్రయత్నాలను తెలియజేశారు.

.