
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్పై గుర్తు తెలియని దుండగులు దాడికి యత్నించారు. బోనాల సందర్భంగా.. మాణికేశ్వర్ నగర్లో ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళుతున్న క్రమంలో 20 మంది గుర్తు తెలియని దుండగులు ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫిర్యాదు చేశారు.
వాహనాలను అడ్డుగా పెట్టి తన కాన్వాయ్ ను అడ్డుకున్నారని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన గన్ మెన్ దగ్గర గన్ లాక్కునేందుకు కూడా దుండగులు ప్రయత్నించారని ఫిర్యాదులో తెలిపారు. 2024లో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్కు చెందిన నివేదితపై 13 వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి, కంటోన్మెంట్ ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపొందిన సంగతి తెలిసిందే.
2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత పోటీ చేసి గెలుపొందారు. ఫిబ్రవరి, 2024లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్కి బై ఎలక్షన్ అనివార్యం అయ్యింది. కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, బీఆర్ఎస్ నుంచి దివంగత సాయన్న చిన్న కూతురు నివేదిత, బీజేపీ నుంచి వంశ తిలక్ పోటీ పడ్డారు. శ్రీగణేశ్ గెలుపుతో అసెంబ్లీలో కాంగ్రెస్కు ఒక సీటు పెరిగింది.