జాకీలతో బిల్డింగ్ పైకి లేపాలనుకున్న ప్రయత్నం విఫలం.. భవనం కూల్చివేత

జాకీలతో బిల్డింగ్ పైకి లేపాలనుకున్న ప్రయత్నం విఫలం.. భవనం కూల్చివేత

జాకీలతో ఇంటి ఎత్తును పెంచాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆ భవనం మరో ఇంటిపై ఒరిగింది. ప్రస్తుతం ఒరిగిన భవనాన్ని  అధికారులు జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో జరిగింది. 

చింతల్ శ్రీనివాసనగర్‌ లో నాగేశ్వర్ రావు అనే వ్యక్తికి జీ ప్లస్‌ 2 బిల్డింగ్ ఉంది. అయితే..ఇటీవల రోడ్డు వేయడంతో బిల్డింగ్ గ్రౌండ్ ఫ్టోర్ రోడ్డు కన్నా కిందికి అయ్యింది. ఎలాగైనా తన ఇంటిని పైకి లేపాలనుకుని.. యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూశాడు. నాగేశ్వరరావు తన బిల్డింగ్ ని హైడ్రాలిక్ జాక్ ల సహాయంతో పైకి లేపాడానికి తమినాడు బిల్డింగ్ లిఫ్ట్ సర్వీసెస్ కు కాంట్రాక్ట్ ఇచ్చాడు. దీంతో వాళ్లు బిల్డింగ్ ను పైకి లేపడానికి నాలుగు సైడ్ లలో గోడలకు హోల్స్ చేసి పైకి లేపే ప్రయత్నం చేశారు. 

అయితే.. ప్రయత్నం విఫలం కావడంతో బిల్డింగ్ కుంగిపోయి పక్కనున్న కృష్ణ బిల్డింగ్ కు ఆనుకుంది. దీంతో రెండు బిల్డింగ్ లు ఎప్పుడు కూలిపోతాయో అని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కుత్బుల్లాపూర్‌ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదివారం (జూన్ 25) మధ్యాహ్నం నుండి భవనాన్ని కూల్చివేస్తున్నారు.

జీహెచ్ఎంసీ నుండి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా భవనాన్ని ఎత్తడంగాని, కూల్చివేయడం లాంటి పనులు ఎవరు చేసినా వారిపై తగు చర్యలు తీసుకుంటామని కుత్బుల్లాపూర్ డీసీ మంగతాయారు తెలిపారు.

రెండు రోజుల్లో భవనాన్ని కూల్చివేత ప్రక్రియను పూర్తి చేస్తామని, అందులో ఉన్నవారికి సదుపాయాలు కల్పిస్తూ.. చుట్టుపక్కల ఎవరికి ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేస్తామన్నారు.