
- సీబీఎస్ఈ బోర్డు నిర్ణయం.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
- మాతృభాషలో బోధిస్తేనే పిల్లలకు ఈజీగా అర్థమవుతుందని ఈ నిర్ణయం
- ఇక స్టేట్ సిలబస్లోనూ అనివార్యం?
హైదరాబాద్, వెలుగు: నర్సరీ నుంచి రెండో తరగతి వరకూ మాతృభాషలోనే బోధనను తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయం తీసుకున్నది. కొత్త విద్యా సంవత్సరం (2025–26) నుంచే దీనిని అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ 2020) అమలులో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా తెలంగాణతో పాటు ఏపీలో సీబీఎస్ఈ స్కూళ్లలో తెలుగులోనే బోధించనున్నారు.
ఎన్ఈపీకి అనుగుణంగా నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్-–2023 పలు సిఫారసులు చేసింది. వీటిలో మాతృభాష లేదా రాష్ట్ర అధికార భాష అమలు నిర్ణయాన్ని ప్రైమరీ లెవల్ లో ప్రీప్రైమరీ నుంచి రెండో తరగతి వరకూ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి సీబీఎస్ఈ బోర్డు అన్ని అనుబంధ స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేసింది.
తెలంగాణలో అధికారకంగా సుమారు 600 సీబీఎస్ఈ స్కూళ్లు ఉండగా, అనధికారికంగా, ప్రాసెస్‌లో ఉన్నవి మరో 500 వరకూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ విద్యాలయాల్లోనూ దీన్ని అమలు చేయబోతున్నారు. దీనికి అనుగుణంగా అన్ని స్కూళ్లు ఏర్పాట్లు చేసుకోవాలని సీబీఎస్ఈ ఆదేశాలిచ్చింది. టీచర్లకూ ట్రైనింగ్ ఇవ్వాలని సూచించింది. జులై నుంచి దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, రిపోర్టులూ పంపించాలని స్కూల్ మేనేజ్మెంట్లకు ఆదేశించింది. దీంతో కార్పొరేట్, ఇంటర్నేషన్ స్కూళ్లలో తెలుగు బోధన తప్పనిసరి కానున్నది
ఫౌండేషన్లో లాంగ్వేజీ కీలకం..
ఎన్ఈపీలో భాగంగా ఫౌండేషన్ స్టేజీలో నర్సరీ, ఎల్కేజీ,యూకేజీ, ఒకటో తరగతి, రెండో తరగతి (8వ ఏట వరకూ) దాకా మాతృభాషలో బోధన చేయనున్నారు. ఈ ఏజ్‌లో మాతృభాషలో చిన్నారులకు సులభంగా పాఠాలు అర్థమవుతాయని అధికారులు చెప్తున్నారు. భాషాపరమైన అవగాహనతో పాటు ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెరుగుతాయని అంటున్నారు. ప్రిపరేటరీ స్టేజ్ లో మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ మాతృభాషతో పాటు మరో భాషను పిల్లలకు పరిచయం చేయనున్నారు. దీని ప్రకారం ఇక మూడో తరగతిలోనే ఇంగ్లిష్ లేదా హిందీ రెండోభాషగా పిల్లలకు చెప్పనున్నారు.
భవిష్యత్తులో స్టేట్ సిలబస్లోనూ..
ప్రస్తుతం స్టేట్ సిలబస్ బడుల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంది. దీన్ని చాలా స్కూళ్లు పెద్దగా అమలు చేయడం లేదు. అయితే, ప్రస్తు తం రెండో తరగతి వరకూ మాతృభాషలోనే బోధన చేయాలని సీబీఎస్ఈ ఆదేశాలివ్వ డంతో దీని ప్రభావం స్టేట్ సిలబస్ స్కూళ్లపైనా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర సిలబస్ అమలు చేస్తున్నవి 10 వేలకు పైగా ప్రైవేటు స్కూళ్లున్నాయి. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది నుంచి తప్పనిసరిగా మాతృభాషలోనే బోధన చేయాలనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసే అవకాశాలున్నాయి.