
న్యూఢిల్లీ: గత కొన్నేండ్లుగా భారత్–చైనా మధ్య అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు సమస్య విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరిహద్దు సమస్య పరిష్కారం కోసం కలిసి పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. బోర్డర్ డీలిమిటేషన్‌కు ముందస్తు పరిష్కారం కోసం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఇండియా, చైనా సూత్రప్రాయంగా నిర్ణయించాయి.
భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ని కలిసిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం (ఆగస్ట్ 19) ఈ ప్రకటన విడుదల చేసింది. వీలైనంత త్వరగా ఇండియా–చైనా మధ్య విమానాలను రాకపోకలను పునఃప్రారంభించాలని ఇరుదేశాలు నిర్ణయించాయని ప్రకనటలో తెలిపింది ఎంఈఏ. అలాగే కైలాస పర్వతం, మానసరోవర్ యాత్రను కూడా పునరుద్ధరించాలని చైనా, భారత్ సూత్రప్రాయం నిర్ణయం తీసుకున్నాయని వెల్లడించింది.
2020లో గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. రష్యాలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ తర్వాత సంబంధాలు మళ్లీ మెరుగుపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లడం.. ఆ తర్వాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇండియా పర్యటనకు వచ్చి ప్రధాని మోడీతో భేటీ కావడంతో ఇరు దేశాల మధ్య మళ్లీ స్నేహాపూర్వక సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరుదేశాల మధ్య కొంత కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని ఇండియా, చైనా నిర్ణయించాయి.