OTTలో పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

OTTలో పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు, సినీ ప్రేమికులకు ఒక శుభవార్త! ఆయన నటించిన భారీ చారిత్రక యాక్షన్ చిత్రం 'హరి హర వీరమల్లు' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. దర్శకుడు క్రిష్ , జ్యోతికృష్ణల దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద అశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.  

థియేటర్లలో పవన్ అభిమానులను అలరించిన ఈ సినిమా, ఇప్పుడు ఆగస్టు 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని 'హరి హర వీరమల్లు' టీమ్ అధికారికంగా ఒక పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రకటించింది. మొదటి భాగం 'పార్ట్-1 స్వోర్డ్ అండ్ స్పిరిట్' పేరుతో విడుదలైంది. ఇక రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ కూడా కొంత పూర్తయినట్లు సమాచారం. పవన్ కల్యాణ్‌తో పాటు బాబీ దేవోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో తమ అద్భుతమైన నటనను ప్రదర్శించారు.

ఈ సినిమా కథాంశం 
కథ 16వ శతాబ్దపు నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (బాబీ దేవోల్) పాలనలో మొదలవుతుంది. ఢిల్లీ పీఠంపై కూర్చొని ఆయన బలవంతపు మత మార్పిడులు, జిజియా పన్నుతో దేశ ప్రజలను పీడిస్తుంటాడు. ఒకవైపు ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే, దేశ సంపద మాత్రం విదేశీయుల చేతుల్లోకి వెళ్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతుల నుంచి సంపదను దోచి పేదలకు పంచిపెడుతూ, సామాన్యుల పాలిట ఒక దేవుడిలా మారతాడు వీరమల్లు (పవన్ కల్యాణ్).

బందరు నుంచి హైదరాబాద్ నవాబ్ వద్దకు తీసుకెళ్తున్న వజ్రాలను కాజేయడం ద్వారా వీరమల్లు పరాక్రమం గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ, ఔరంగజేబు సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని అతనికి ఒక కఠినమైన బాధ్యతను అప్పగిస్తాడు. ఔరంగజేబు సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా వెళ్లాడు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి? అతని జీవితంలో పంచమి (నిధి అగర్వాల్) పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే, మీ కుటుంబంతో కలిసి  ఓటీటీలో ఈ అద్భుతమైన సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించండి.