హైదరాబాద్‌లో కేబుల్ వైర్లు తొలగించడంపై COAI డైరెక్టర్ కీలక ప్రకటన

హైదరాబాద్‌లో కేబుల్ వైర్లు తొలగించడంపై COAI డైరెక్టర్ కీలక ప్రకటన

హైదరాబాద్‌లో విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ తొలగించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ రామంతాపూర్ కరెంట్ షాక్ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం కేబుల్‌ వైర్లు తొలగించాలని ఆదేశించింది. ఈ కారణంగా.. రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, మణికొండ, మేడ్చల్ ప్రాంతాలతో పాటు నగరంలోని చాలాచోట్ల విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను తొలగించారు. అయితే.. ఈ పరిణామంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ (COAI) Cellular Operators Association of India ప్రకటన విడుదల చేసింది.

ఇంటర్నెట్ అందించే కేబుల్స్లో విద్యుత్ ప్రసారం కాదని, కేబుల్ వైర్లకు.. కరెంట్ షాక్కు సంబంధం లేదని COAI డైరెక్టర్ ఎస్పీ కొచ్చర్ స్పష్టం చేశారు. ఆప్టికల్ కేబుల్‌ వైర్లను తొలగించకుండా చూడాలని విద్యుత్ శాఖను కోరారు. ఇలా కేబుల్ వైర్లను ఉన్నపళంగా తొలగించడం వల్ల హైదరాబాద్ సిటీలో ఇంటర్నెట్ కనెక్టివిటీకి తీవ్ర అంతరాయం కలిగిందని పేర్కొన్నారు.

ఇంటర్నెట్ రావడం లేదని హైదరాబాద్ సిటీతో పాటు సిటీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయని, ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు తెలిపింది. కేబుల్ తీగలను కట్ చేస్తుండటంపై నిరసన వ్యక్తం చేస్తూ హైదరాబాద్లో కేబుల్ ఆపరేటర్లు మంగళవారం ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. రామంతాపూర్ ఘటనకు కేబులు వైర్లు కారణం కాదని, కేబుల్ వైర్లలో విద్యుత్ ప్రసారం కాదని ఆపరేటర్లు చెప్పారు.

కేబుల్ వైర్లు తొలగిస్తే లక్షల మంది ఉపాధి కోల్పోతారని, వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు ఇబ్బంది పడతారని TGSPDCL కార్యాలయం ఎదుట కేబుల్ ఆపరేటర్లు ధర్నాకు దిగారు. కేబుల్ వైర్ల వల్లే రామంతాపూర్ దుర్ఘటన జరిగిందని విద్యుత్ శాఖ సీఎండీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో హైదరాబాద్తో పాటు నగర శివారు ప్రాంతాల్లో చాలాచోట్ల విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించారు.