
హైదరాబాద్ సిటీలో ఇంటర్నెట్ ఇష్యూ నడుస్తుంది. కరెంట్ పోల్స్‌పై ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ఎక్కడికక్కడ కట్ చేస్తుండటం కల్లోలం రేపుతోంది. రెండు రోజులు వరుసగా జరిగిన ఘటనలతో పోలీస్, కరెంట్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. రామంతాపూర్‌లో కృష్ణుడి రథయాత్రలో కరెంట్ షాక్ తగిలి ఐదుగురు చనిపోయారు.. అదే విధంగా వినాయకుడి విగ్రహం తరలిస్తూ మరో ఇద్దరు కరెంట్ వైర్లు తగిలి చనిపోయారు. ఈ రెండు ఘటనల తర్వాత ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కరెంట్ పోల్స్‌కు ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను వెంటనే తొలగించాలని.. ఏడాది సమయం ఇచ్చినా ఇప్పటి వరకు సర్వీస్ ప్రొవైడర్లు స్పందించలేదంటూ విద్యుత్ శాఖ అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై మంత్రి భట్టి స్పందించారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం వంటి కీలక కార్యక్రమాలు రాబోతున్నాయని.. వెంటనే కరెంట్ పోల్స్‌కు ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లు తొలగించాలని ఆదేశించారు.
Also read:-హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడేలా.. గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి
ఈ క్రమంలోనే.. 2025, ఆగస్ట్ 19వ తేదీ ఉదయం నుంచి కరెంట్ స్తంభాలకు ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లకు ఎక్కడికక్కడ కట్ చేస్తున్నారు విద్యుత్ శాఖ సిబ్బంది. దీంతో హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ బ్రేక్ వచ్చింది. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా వేల మంది కేబుల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. ఇప్పుడు కరెంట్ సిబ్బంది వైర్లు కట్ చేస్తుండటంతో ఆగమాగం అవుతున్నారు. ఇంటర్నెట్ రావటం లేదని.. కేబుల్ టీవీ రావటం లేదంటూ వేల కాల్స్ వస్తున్నాయి ఈ సర్వీస్ ప్రొవైవర్లకు.. కట్ అయిన వైర్లను ఎక్కడి నుంచి లాక్కోవాలి.. ఎటు నుంచి వేయాలి అనే పెద్ద సమస్య వచ్చింది వీళ్లను.
ఓ వైపు కట్ అవుతున్న వైర్లు.. మరో వైపు కస్టమర్ల నుంచి వస్తున్న కంప్లయింట్స్‌తో సర్వీస్ ప్రొవైడర్లు తలలు బాదుకుంటున్నారు. ఎప్పుడు ఎక్కడ.. ఏ వైర్ కట్ అవుతుందో అన్న టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే జియో, ఎయిర్ టెల్ వంటి పెద్ద కంపెనీల నుంచి పోటీ ఉన్న సమయంలో.. లోకల్ సర్వీస్ ప్రొవైడర్ల కనెక్షన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని.. విద్యుత్ శాఖ కొంత కాలం సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కేబుల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, వాళ్ల దగ్గర పని చేసే సిబ్బంది లక్ష మంది వరకు ఉన్నారు. వీళ్ల నుంచి 10 లక్షల కస్టమర్లు ఉన్నారు. ఇప్పుడు వీళ్లందరూ ఇబ్బందుల్లో పడ్డారు. లక్ష కుటుంబాలు ప్రమాదంలో పడ్డాయి.. 10 లక్షల మంది కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు.. స్టాప్ కేబుల్ కటింగ్ అంటూ ఇంటర్నెట్లో పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే లక్ష కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని.. 10 లక్షల మంది కస్టమర్లు ఇబ్బందుల్లో పడతారని.. వెంటనే కేబుల్ కటింగ్ ఆపాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వం మరికొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు.