హాకీ ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్.. టోర్నీ నుంచి తప్పుకున్న పాకిస్తాన్, ఒమన్

హాకీ ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్.. టోర్నీ నుంచి తప్పుకున్న పాకిస్తాన్, ఒమన్

న్యూఢిల్లీ: బీహార్ వేదికగా 2025, ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరగనున్న హాకీ ఆసియా కప్–2025 షెడ్యూల్ విడుదల అయ్యింది. ఆసియా హాకీ సమాఖ్య (AHF) మంగళవారం (ఆగస్ట్ 19) టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించింది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ నుంచి పాకిస్థాన్, ఒమన్ దేశాలు తప్పుకున్నాయి. పాకిస్థాన్ స్థానంలో బంగ్లాదేశ్, ఒమన్ స్థానంలో కజకిస్తాన్ జట్లు బరిలోకి దిగనున్నాయి.

పూల్–ఏలో ఆతిథ్య భారత్‎తో పాటు చైనా, జపాన్, కజకిస్తాన్‌ ఉండగా.. పూల్–బీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ కొరియా, మలేషియా, చైనీస్ తైపీ, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో విజయం సాధించిన జట్టు బెల్జియం, నెదర్లాండ్స్‌ వేదికగా జరగనున్న హకీ–2026 ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది.

తొలి మ్యాచ్‌లో చైనాతో తలపడనున్న భారత్:

2025, ఆగస్టు 29 నుంచి హాకీ ఆసియా కప్ ప్రారంభం కానుంది. 29వ తేదీ ఉదయం 9 గంటలకు మలేషియా, బంగ్లాదేశ్ మ్యాచుతో ఈ టోర్నీకి తెరలేవనుంది. అదే రోజు మధ్యాహ్నాం 3 గంటలకు అతిథ్య భారత్ తన తొలి మ్యాచ్‌లో చైనాతో తలపడనుంది. ఆగస్టు 31న జపాన్‌తో భారత్ తమ రెండో మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 1న కజకిస్తాన్‌తో తమ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది మెన్ ఇన్ బ్లూ. రెండు పూల్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి రెండు జట్లు సెప్టెంబర్ 3 నుంచి జరిగే సూపర్ 4 పోరుకు అర్హత సాధిస్తాయి. సూపర్ 4లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెప్టెంబర్ 7న జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‎లో టైటిల్ కోసం తలపడనున్నాయి. 

ఇండియా వచ్చేందుకు పాక్ నిరాకరణ:

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‎తో భారత్–పాక్ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భద్రతా సమస్యల కారణంగా భారతదేశానికి రావడానికి పాక్ నిరాకరించింది. అయితే, టోర్నమెంట్ కోసం భారత్ వచ్చే ఆటగాళ్లకు వీసా కల్పిస్తామని భారత ప్రభుత్వం చెప్పినప్పటికీ.. పాకిస్తాన్ హాకీ సమాఖ్య ఇండియాకు వచ్చేందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా కీలకమైన టోర్నీ నుంచి పాకిస్థాన్ తప్పుకోవాల్సి వచ్చింది.