Asia Cup 2025: అయ్యర్, జైశ్వాల్‌తో పాటు మరో నలుగురు స్టార్ క్రికెటర్లపై వేటు.. కారణమిదే!

Asia Cup 2025: అయ్యర్, జైశ్వాల్‌తో పాటు మరో నలుగురు స్టార్ క్రికెటర్లపై వేటు.. కారణమిదే!

ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత స్క్వాడ్ లో సెలక్టర్లు ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. ఫామ్ లో ఉండి నిలకడగా రాణించిన 15 మందిని ఎంపిక చేశారు. మంగళవారం (ఆగస్టు19)సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మంది జట్టులో దాదాపు యంగ్ క్రికెటర్లకే చోటు కల్పించారు. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగబోతుంది. ఈ కాంటినెంటల్ టోర్నీకి మరో 20 రోజుల సమయం ఉంది. 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని ఈ జట్టును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 15 మంది జాబితాలో శ్రేయాస్ అయ్యర్ తో పాటు, యశస్వి జైశ్వాల్, వాషింగ్ టన్ సుందర్ లకు దురదృష్టవశాత్తు చోటు దక్కలేదు. వీరితో పాటు కొంతమంది స్టార్ క్రికెటర్లను సెలక్టర్లు పక్కన పెట్టారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. 

రిషబ్ పంత్:
 
ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో గాయపడిన పంత్ సర్జరీ నుంచి తప్పించుకున్నాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో గాయపడిన రిషబ్.. ఓవల్ లో జరిగిన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. కాలికి తీవ్ర గాయం కావడంతో మొదట సర్జరీ అవసరమని భావించినా.. ఆ తర్వాత ఆ అవసరం లేదని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. గాయపడిన పంత్ కు 6 వారాల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో పంత్ సెప్టెంబర్ లో జరగబోయే ఆసియా కప్ కు దూరమయ్యాడు. ఒకవేళ పంత్ ఫిట్ గా ఉండి ఉంటే జితేష్ శర్మ స్థానంలో చోటు సంపాదించేవాడు.   

కేఎల్ రాహుల్:

భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆసియా కప్ కు సెలక్ట్ కాలేదు. కుర్రాళ్లతో పోటీ కారణంగా రాహుల్ కు జట్టులో అవకాశం దక్కనట్టు స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టీమిండియా టీ20ల్లో అదరగొడుతుంది. అనుభవజ్ఞుడైన రాహుల్ లేకపోయినా ఆ ప్రభావం జట్టుపై పడే అవకాశం లేదు. వికెట్ కీపర్ గా సంజు శాంసన్ తొలి ఆప్షన్ కాగా.. జితేష్ శర్మ బ్యాకప్ కీపర్ గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో రాహుల్ అద్భుతంగా రాణించినా అనుభవం కంటే సెలక్టర్లు కుర్రాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. 

మహమ్మద్ సిరాజ్: 

హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు సైతం ఆసియా కప్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ కు అందుబాటులో ఉన్నాడు. బుమ్రాతో పాటు టీ20 స్పెషలిస్ట్ అర్షదీప్ సింగ్ జట్టులో తుది జట్టులో ఉండడం ఖాయం. వీరికి బ్యాకప్ గా యంగ్ పేసర్ హర్షిత్ రానా స్క్వాడ్ లో చోటు దక్కింది. ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్ లో సిరాజ్ అద్భుతంగా రాణించి టాప్ వికెట్ టేకర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా భారత టీ20 జట్టులో సిరాజ్ కొనసాగకపోవడం మైనస్ గా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కించుకోలేకపోయిన సిరాజ్ కు మరోసారి నిరాశే ఎదురైంది. 

మహమ్మద్ షమీ: 

టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఆసియా కప్ లాంటి మెగా టోర్నీకి సెలక్ట్ అవుతాడని భావించినా అది జరగలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బుమ్రా లేకపోవడంతో షమీని ఎంపిక చేశారు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. అయితే వన్డే ఫార్మాట్ కావడం.. బుమ్రా కూడా లేకపోవడంతో షమీకి ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ లో షమీని నమ్ముకునే పరిస్థితిలో భారత యాజమాన్యం లేనట్టు తెలుస్తోంది. అతని ఫిట్ నెస్ తో పాటు వయసు పొట్టి ఫార్మాట్ కు సహకరించడం కష్టం.  2025లో షమీ భారతదేశం తరపున 2 టీ20 మ్యాచ్ లు ఆడాడు. 5.3 ఓవర్లు బౌలింగ్ చేసి 9.43 ఎకానమీతో 3 వికెట్లు పడగొట్టాడు.