
హైదరాబాద్ నగరంలో ఎన్నడూ చూడని ట్రాఫిక్ సమస్యలు ఇటీవల చూడాల్సి వస్తోంది. కంటిన్యూగా.. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు జంట నగరాల్లో ట్రాఫిక్ మొదలైంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ రూట్లలో ఘోరంగా జాం అవుతోంది. మంగళవారం (ఆగస్టు 19) ఉదయం నుంచి కూకట్ పల్లి జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ రూట్ మొత్తానికే బ్లాక్ అయిపోయింది.
హైదరాబాద్ లో ఎప్పుడూ లేనంతగా కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. కూకట్ పల్లి జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ మార్గం పూర్తిగా స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయారు. నిమిషానికి మీటర్ దూరం కూడా కదిలే పరిస్థితి లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రగతి నగర్ నుంచి జేఎన్టీయూ మీదుగా హైటెక్ సిటీ వరకు ట్రాఫిక్ జాం అయ్యింది. ప్రగతి నగర్ నుంచి జేఎన్టీయూకు రావడానికి గంట సేపు పడుతోంది. అదే విధంగా జేఎన్టీయూ నుంచి నెక్సస్ ఫ్లై ఓవర్ రావడానికి గంటకు పైగా పడుతోందని వాహనదారులు చెబుతున్నారు. నెక్సస్ ఫ్లై ఓవర్ కింద, పైనా ట్రాఫిక్ జాం అయ్యింది. కనీసం గల్లీ మార్గాలకు మళ్లించేందుకు కూడా వీలు లేకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారు వాహనదారులు.
ఒకవైపు ట్రాఫిక్ జాం, మరోవైపు హారన్ల మోతలతో రోడ్లు మారుమోగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎంత ప్రయత్నించినా ట్రాఫిక్ క్లియర్ చేయడం కష్టంగా మారింది. ఈ రూట్లో ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు మద్యాహ్నం 12 గంటలు దాటవచ్చని చెబుతున్నారు పోలీసులు.