ఆయుష్మాన్ ఖురానా చంఢీగడ్‌లోని పంజాబీ ఫ్యామిలీలో పుట్టాడు. ఆయుష్మాన్ వాళ్ల నాన్న ఆస్ట్రాలజర్, అమ్మ హౌస్ వైఫ్. ఇతని బ్రదర్ అపరశక్తి ఖురానా కూడా నటుడే. ఇంగ్లిష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్, మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఐదేండ్లు నాటకాల్లో పనిచేశాడు. తను కాలేజీలో చదువుతున్న రోజుల్లో చాలా నాటకాల్లో పర్ఫార్మ్ చేశాడు.
అంతేకాదు, చంఢీగడ్‌లో రెండు థియేటర్ కాలేజీలను స్థాపించాడు. నాటకాలంటే ఎంతిష్టమంటే ఎన్నో వీధి నాటకాలు, కాలేజీ ఫెస్టివల్స్‌లో నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. నాటకాల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నాడు. లిటరేచర్ చదవడంతో ఆయుష్మాన్‌కి రైటింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండేది. దాంతో ఒక బ్లాగ్ కూడా మొదలుపెట్టాడు. హిందీలో అతను రాసే బ్లాగ్స్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఆయుష్మాన్ తన పనికోసం ముంబైలో ఉండిపోయాడు. ఫ్యామిలీ మాత్రం చంఢీగడ్లోనే ఉండేది. చదువు పూర్తయ్యాక రేడియో జాకీగా ఢిల్లీలో పనిచేశాడు. యంగెస్ట్ అచీవర్స్ అవార్డ్ గెలుపొందాడు. అంతేకాదు ఢిల్లీలో భారత్ నిర్మాన్ అవార్డ్ పొందిన యంగెస్ట్ పర్సన్ ఇతనే. ఆ తర్వాత ఆయుష్మాన్ కొన్ని టీవీ షోలు హోస్ట్ చేశాడు.
కల వైపు అడుగులు
‘‘నేను నటుడిని కావాలనుకున్నప్పుడు నా వయసు ఐదేండ్లు. కానీ అది నేనెవరికీ చెప్పలేదు. కళల్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేసేవారు. మా నాన్న వేణువు వాయిస్తాడు. హిందీ సినిమా సంగీతం విషయానికి వస్తే అతను ఒక ఎన్ సైక్లోపీడియా లాంటివాడు. కానీ, నేను ఒక చిన్న నగరంలో చాలా మధ్యతరగతి విలువలు, అభద్రతా భావాల మధ్య పెరిగా. నా బాలీవుడ్ కలల గురించి నాన్న ముందు నోరు తెరిచి చెప్పలేకపోయా. కానీ రహస్యంగానైనా నా కల వైపు అడుగులు వేయాలని ఎంచుకున్నా.
కెరీర్ స్టార్ట్ అయ్యాక మొదటి సినిమా ఎంతో పేరు తెచ్చింది. ఆ తర్వాత మూడు సినిమాల వరకు సక్సెస్ అనే మాటే వినిపించలేదు. అప్పుడు బాధపడ్డా. కానీ, అలా జరిగినందుకు నాకు సంతోషమే. ఫెయిల్యూర్స్ నుంచి చాలా నేర్చుకున్నా. ఎప్పుడూ అతిగా అంచనాలు పెట్టుకోకూడదు. నాకు గొప్ప స్క్రిప్ట్ సెన్స్ ఉందని కూడా నమ్మను. ఎందుకంటే ప్రతి శుక్రవారం మీ రాతను మార్చేస్తూ ఉంటుంది. పార్ట్నర్ ఎల్లప్పుడూ మనకు సపోర్ట్ చేస్తారని ఎదురుచూడకూడదు. సెల్ఫ్ మోటివేషన్ అవసరం. నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకోవాలి.’’
భార్య గురించి..
ఖురానా భార్య తహిరా కశ్యప్‌కు 2018 మధ్యలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. ‘‘సెప్టెంబర్ 14న నాది బర్త్‌డే. ఆ రోజే మాకు ఆ విషయం తెలిసింది. కానీ, దీని గురించి బాధపడడంలో అర్థం లేదు అనిపించింది. ఎందుకంటే ఈ వ్యాధితో పోరాడాలని మాకు తెలుసు. ఆమె దాన్నుంచి బయటపడాలని కోరుకుంది. కీమో థెరపీతోపాటు కౌన్సెలింగ్లకు వెళ్లింది. చాలామంది క్యాన్సర్ రోగులను కలిసింది. చికిత్స జరుగుతుండగా ఆమె ఇంకా విడుదల కాని తన షార్ట్ ఫిల్మ్ కోసం ప్రీ– ప్రొడక్షన్లో కూడా పనిచేసింది. మేమిద్దరం ఎక్కువ బిజీగా ఉంటూ దాని గురించి ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించాం.
ఈ జర్నీలో ఆమె ఎప్పుడూ ‘నాకే ఎందుకు?’ అనే ప్రశ్న వేయలేదు. దాని గురించి ఆలోచిస్తే పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యేది”. తన భార్యలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యాడు. ‘‘ఆమె చాలా స్ట్రాంగ్, స్పోర్ట్స్ పర్సన్. కానీ, ఈ వ్యాధి గురించి తెలిసినప్పుడు ఆమె ఎక్సర్సైజ్ వల్ల మానసికంగా మరింత స్ట్రాంగ్ అయింది. ఆమె వ్యక్తిత్వంలో సమూల మార్పు తెచ్చింది. ఒకప్పుడు ఇంజెక్షన్ చూస్తే భయపడేది. ఇప్పుడు తానే చేసుకుంటుంది’’ అని తన భార్య గురించి చెప్పాడు ఖురానా.
చిన్నప్పుడు ఎన్నో కలలు కంటాం. కానీ పెద్దయ్యాక మన అభిరుచులు మారొచ్చు. అప్పుడు ఏం చేయాలనుకుంటే దానివైపే అడుగులు వేస్తాం. కానీ, కొందరు చిన్ననాటి కలను మనసులోనే దాచుకుని, సమయం వచ్చేవరకు వేచి చూస్తారు. అప్పటివరకు ఎన్నో రకాల పనులు చేసి గమ్యానికి చేరతారు. అలా తన గమ్యస్థానాన్ని చేరుకున్న వ్యక్తి ఆయుష్మాన్ ఖురానా. ఐదేండ్ల వయసులోనే యాక్టర్ కావాలనే కోరిక పుట్టింది. కానీ, నాన్నకు చెప్పే ధైర్యం లేక మనసులోనే దాచుకున్నాడు. చదువు పూర్తయ్యాక నాటక రంగంలో అడుగుపెట్టి బాలీవుడ్లో నటుడిగా నిరూపించుకున్నాడు. తన సింగింగ్‌తో ఆడియెన్స్‌కు మరింత చేరువయ్యాడు.
సినిమా కెరీర్
2012లో ఆయుష్మాన్ తన యాక్టింగ్ కెరీర్‌ని స్టార్ట్ చేశాడు. ‘విక్కీ డోనర్’ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా కోసం వర్క్‌షాప్స్‌కి అటెండ్ అయ్యాడు. ఇతని యాక్టింగ్‌కి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో తను ఒక పాట కూడా పాడాడు. కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఆ సినిమాకు బెస్ట్ మేల్ డెబ్యూ యాక్టర్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. 2013లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రెటీ100 లిస్ట్‌లో 70వ ర్యాంక్‌లో నిలిచాడు.
అలా వరుసగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ప్లేబ్యాక్ సింగర్‌గాను ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. రీసెంట్గా రష్మిక దెయ్యం పాత్రలో నటించిన ‘థామ్మా’ మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఈ ఏడాది తాను నటించిన డ్రీమ్ గర్ల్ 2, థామ్మా అనే రెండు సినిమాలు రిలీజ్ అయి వందకోట్ల క్లబ్లో చేరాయి. రాబోయే ఏడాది మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ‘‘పతి పత్ని ఔర్ వో” సినిమాలో కనిపించబోతున్నాడు.
