
నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 584.60 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 296.2801 టీఎంసీలకు చేరింది. ఇన్ ఫ్లో 410186 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 409791 క్యూసెక్కులు.
ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కృష్ణా ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ గేట్లు ఎత్తటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
గత కొద్ది రోజులుగా ఎగువన కురుస్తోన్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సాగర్ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లను ప్రత్యక్షంగా చూసి పులకించిపోయేందుకు పర్యాటకులు నాగార్జున సాగర్‌కు క్యూ కడుతున్నారు. పర్యాటకులతో సాగర్ ప్రాజెక్ట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. సాగర్‌లోని కొత్త బ్రిడ్జి, పవర్‌హౌస్, ప్రధాన డ్యాం క్రస్ట్ గేట్ల సమీపంలో, శివాలయం రోడ్‌లో సెల్ఫీలు దిగుతున్నారు. కొన్ని రోజులుగా ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వరద తగ్గినా.. ఇప్పుడు మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు పడుతుండడంతో మళ్లీ వరద మొదలైంది.
జూరాల, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతున్నది. జూరాలకు 2 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు 3 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద వస్తుండటం గమనార్హం. వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు జులైలోనే నిండిన సంగతి తెలిసిందే. ఈ వీకెండ్ లోపు నాగార్జున సాగర్ వెళ్లగలిగితే డ్యాం అందాలను వీక్షించే అవకాశం ఉంటుంది.