
హైదరాబాద్: కిడ్నాప్ కేసును కేవలం 6 గంటల్లోనే ఛేధించారు బండ్లగూడ పోలీసులు. బాధితుడిని రక్షించడంతో పాటు గంజాయి బ్యాచ్‌కు చెందిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. బండ్లగూడకు చెందిన కార్మికుడు షేక్ షహసా వాలిని మంగళవారం (ఆగస్ట్ 19) గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆటోలో ఎత్తుకెళ్లి కత్తితో బెదిరించి డబ్బుల డిమాండ్ డిమాండ్ చేశారు.
బాధితుడి అన్నకు ఫోన్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన బాధితుడి సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు షేక్ షహసా వాలి కోసం దర్యాప్తు చేపట్టారు. సీపీ పుటేజీల ఆధారంగా కేవలం 6 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు పోలీసులు.
చింతెల్మెట్, రాజేంద్రనగర్‌కు చెందిన అమీర్, ఒమర్, అమీర్ అలీ, రహ్మాన్, ఇమ్రాన్, నయీబ్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆటో, కత్తి, ఇతర ఆధారాలు సీజ్ చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఈ ఆపరేషన్‌ను డీసీపీ చైతన్యకుమార్, ఏసీపీ సుధాకర్ పర్యవేక్షణలో విజయవంతంగా పూర్తి చేశారు పోలీసులు. కేవలం ఆరు గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.