
బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. ఇది బలపడుతుంది. వాయుగుండంగా మారనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 2025, మే 28వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు అల్పపీడనం ఏర్పడినట్లు అధికారికంగా ప్రకటించింది వాతావరణ శాఖ. ప్రస్తుతం ఈ అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో.. ఒడిశా రాష్ట్రం తీరం వెంట ఉందని.. ఇది క్రమంగా బలపడుతుందంటూ శాటిలైట్ ఫొటోలు రిలీజ్ చేసింది వాతావరణ శాఖ.
మే 29వ తేదీ సాయంత్రం నాటికి అల్ప పీడనం బలపడి.. వాయుగుండంగా మారనున్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండంగా మారిన తర్వాత ఇది ఉత్తర బంగాళాఖాతం వైపు పయనిస్తుందని.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ దేశాల మధ్య కేంద్రీకృతం అయ్యి ఉంటుందని వెల్లడించింది. మే 31వ తేదీ నాటికి ఈ వాయుగుండం తన దిశను మార్చుకుని.. ఏపీ తీరం వైపు రావొచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.
Also Read:-మొత్తం 4 రోజులు వర్షాలు.. 2 రోజులు అతి భారీ వర్షాలు.. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
జూన్ ఒకటో తేదీ వరకు ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఉంటుందని.. అప్పటి వరకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని.. సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఏపీ, ఒడిశా రాష్ట్రాల మత్స్యకారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించటం జరిగిందని.. ఇది బలపడే కొద్దీ దాని దిశ, వేగంపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేసింది భారత వాతావరణ కేంద్రం.
రాబోయే ఐదు రోజులు అంటే.. జూన్ ఒకటో తేదీ వరకు దీని ప్రభావం ఉంటుందని.. ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు.. తీర ప్రాంతంలో గంటకు35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయని.. జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మే 30వ తేదీ నాటికి వాయుగుండం తీవ్రత, వేగం, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని.. వాయుగుండం బలపడి.. తుఫాన్ గా మారుతుందా లేదా అనే విషయాలపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేసింది భారత వాతావరణ శాఖ.
దేశంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చిన ఈ సమయంలో.. రుతు పవనాలు విస్తరిస్తున్న ఈ సమయంలో తుఫాన్ ఏర్పడితే అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిన తర్వాత.. బలహీన పడుతుందా లేక బలపడి తుఫాన్ గా మారుతుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.