మొత్తం 4 రోజులు వర్షాలు.. 2 రోజులు అతి భారీ వర్షాలు.. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

మొత్తం 4 రోజులు వర్షాలు.. 2 రోజులు అతి భారీ వర్షాలు.. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
  • మహబూబ్​నగర్​లోకి  విస్తరణ
  • ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసిన ఐఎండీ
  • ఈ ఏడాది  సాధారణం కన్నా ఎక్కువవర్షపాతం రికార్డవుతుందని అంచనా
  • 111 శాతం కన్నా ఎక్కువ నమోదయ్యే చాన్స్​ ఉందని వెల్లడి
  • పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన

హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 4  రోజులపాటు వర్షాల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. బుధ, గురువారాలకు ఆరెంజ్​ అలర్ట్ ను జారీ చేసింది. ఆ తర్వాత రెండు రోజులకు ఎల్లో అలర్ట్​ను ఇష్యూ చేసింది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నట్టు తెలిపింది. మంగళవారం మహబూబ్​నగర్​ జిల్లా వరకు మాన్​సూన్​ విస్తరించిందని పేర్కొన్నది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని తెలిపింది. తెలంగాణకు దూరంగా ఆ అల్పపీడనం ఉందని, దాని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని పేర్కొన్నది.

అయితే, రాష్ట్రంలో మాత్రం తొలి రెండు రోజులు అతి భారీ వర్షాలు, ఆ తర్వాత రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్​లోనూ 2 రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొన్నది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 5 నుంచి 7 డిగ్రీల మేర పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. కాగా, రాష్ట్రంలో ఈ సీజన్​లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. 111 శాతం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని మంగళవారం విడుదల చేసిన దీర్ఘకాలిక వర్షపాత అంచనాల్లో వెల్లడించింది. 

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం 
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్​, జగిత్యాల, కరీంనగర్​, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, ములుగు, హనుమకొండ, వరంగల్​, మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లో మంగళవారం జోరు వానపడింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కరీంనగర్​ జిల్లా ఖాసింపేటలో 11.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లిలో 10.8 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో 10.8, జగిత్యాల జిల్లా తిరుమలాపూర్​లో 10.3, జనగామ జిల్లా గూడూరులో 10.1, ములుగు జిల్లా మల్లూరులో 10, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 9.4, సిరిసిల్ల జిల్లా మర్రిగూడలో 8.8, సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో 8.6, ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూరు క్రాస్​ రోడ్​లో 8.2, ఆదిలాబాద్​లో 8.1, సిరిసిల్ల జిల్లా నిజామాబాద్​లో 7.8, ఆదిలాబాద్​ జిల్లా భోరజ్​లో 7.7, మహబూబాబాద్​ జిల్లా మల్యాలలో 7.5, కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్​​లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో 7 కన్నా తక్కువ వర్షపాతం రికార్డయింది.

ఇంట్లోకి చేరిన వర్షం నీటిలో మునిగి వ్యక్తి మృతి
జీడిమెట్ల, వెలుగు: ఇంట్లోకి భారీగా వర్షం నీరు రావడంతో ఓ వ్యక్తి నీట మునిగి చనిపోయాడు. హైదరాబాద్ సూరారం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూరారం కాలనీ లాస్ట్​బస్​స్టాప్ రోడ్డులో కృష్ణవేణి అనే మహిళ తన ఐదో కొడుకు పద్మారావు(40)తో కలిసి నివాసం ఉంటోంది. డ్రైవర్ గా పని చేస్తున్న పద్మారావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా.. మూడేండ్ల కింద కుటుంబ కలహాల వల్ల వారి నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడు రోజూ మద్యం తాగేవాడని స్థానికులు చెప్తున్నారు. మంగళవారం సూరారం కాలనీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. 

పద్మారావు ఇల్లు కూడా లోతట్టులో ఉండటం వల్ల ఇంట్లోకి వరద నీరు చేరింది. పక్క గదిలో నిద్రపోతున్న కృష్ణవేణి అప్రమత్తమై వచ్చి కొడుకును తట్టి లేపింది. కానీ అతడు లేవకపోవడంతో బయట రోడ్డు మీదకు లాక్కొచ్చింది. స్థానికులు108కి ఫోన్ చేయడంతో సిబ్బంది వచ్చారు. పద్మారావు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. అయితే, మద్యం మత్తు వల్లే వర్షం నీటిలో మునిగినా గుర్తించలేని స్థితిలో పద్మారావు చనిపోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. 

హైదరాబాద్లోనూ..
హైదరాబాద్​ నగరంలోనూ భారీ వర్షం కురిసింది. సాయంత్రం 7 గంటల నుంచి దాదాపు 2 గంటల పాటు ఆగకుండా వర్షం పడింది. సికింద్రాబాద్, అల్వాల్, లింగంపల్లి, కూకట్​పల్లి, జూబ్లీహిల్స్, సూరారం, బోరబండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్​ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. అత్యధికంగా రామచంద్రాపురంలో 5.5 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. పటాన్​చెరులో 4 సెంటీ మీటర్లు, గచ్చిబౌలిలో 2.3, హఫీజ్​పేటలో 2.2, జూబ్లీహిల్స్​లో 2.1, లింగంపల్లిలో 2, చందానగర్​లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.