
- స్టూడెంట్స్ హాజరు 67 శాతంతో ఖమ్మం జిల్లా టాప్
- 49 శాతంతో చివరి స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
- డ్యూటీలకు రాకుండా హాజరు వేసుకునే టీచర్లకు చెక్
- హాజరు శాతం పెరగడంపై పేరెంట్స్ సంతోషం
ఖమ్మం, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా సర్కార్ స్కూళ్లలో టీచర్లు, విద్యార్థుల అటెండెన్స్ పెంచేందుకు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఫేసియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) ద్వారా రిజల్ట్ వస్తోంది. గత ఆగస్టు నుంచి ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తుండగా.. టీచర్లు, విద్యార్థుల హాజరు శాతంలో ఖమ్మం జిల్లా ఫస్ట్ ప్లేసులో నిలిచింది.
జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లు 1,179 ఉండగా.. వీటిలో 66,302 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇందులో 66,155 మంది ఎఫ్ఆర్ఎస్ కింద రిజిస్టర్ అయ్యారు. జిల్లావ్యాప్తంగా స్కూళ్లలో రెగ్యులర్ గా 60–80 శాతం మధ్య అటెండెన్స్ నమోదువుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలతో పోల్చితే.. 67 శాతం విద్యార్థుల హాజరు నమోదుతో ఖమ్మం జిల్లా తొలిస్థానంలో నిలిచింది.
డుమ్మా టీచర్లకు చెక్
ఎఫ్ఆర్ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత టీచర్ల హాజరు శాతం కూడా పెరిగింది. అంతకుముందు డ్యూటీలకు రాకుండానే మాన్యువల్ రిజిస్టర్లలో అటెండెన్స్ వేసే టీచర్లకు చెక్ పడింది. వర్క్ ప్లేస్ లో కాకుండా జిల్లా కేంద్రంలో, డివిజన్ కేంద్రాల్లో ఉంటూ కూడా సమయానికి స్కూళ్లకు టీచర్లు వెళ్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ కారణంగా డ్యూటీలకు టీచర్లు డుమ్మా కొట్టే చాన్స్ లేకుండా పోయింది.
సమయానికి స్కూల్ కు వెళ్తున్న పరిస్థితి ఉంది. గతంతో పోలిస్తే అన్ని జిల్లాల్లో హాజరు శాతం బాగా పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలు 26,825 ఉండగా, 1,28,760 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. కొన్ని జిల్లాల్లో 2 శాతం నుంచి 25 శాతం వరకు టీచర్ల అటెండెన్స్ పెరుగుదల నమోదైంది.
ఇది నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో 2 శాతం, ఖమ్మం, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో 3 శాతం, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 6 శాతం, సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో 10 శాతం, సిరిసిల్ల జిల్లాలో 12, మహబూబాబాద్ జిల్లాలో 15, జగిత్యాల జిల్లాలో 19 శాతం చొప్పున ఉంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 25 శాతం టీచర్ల అటెండెన్స్ పెరిగింది. ఇక విద్యార్థుల చదువులోనూ నాణ్యత పెరుగుతుందని పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్కూల్ కు రెగ్యులర్ గా రావాలి
మా పాప వేద వర్షిత వైరా బాలికల స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ స్కాలర్ షిప్ నకు ఎంపికైంది. స్కూల్ కు టీచర్లు రెగ్యులర్ గా అటెండ్ అయితే ప్రైవేట్ స్కూల్ కంటే మంచి ఫలితాలు వస్తాయి. ఎఫ్ఆర్ఎస్ ద్వారా రిజల్ట్స్ బాగుంది. భవిష్యత్ లో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు కూడా పెరుగుతాయి. - చీరాల నవీన్, పేరెంట్, వైరా
అటెండెన్స్ మరింత పెరిగేలా చర్యలు
జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ ను పకడ్బందీగా అమలు చేస్తాం. టీచర్ల, విద్యార్థుల అటెండెన్స్ పర్సంటేజ్ మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ అకాడమిక్ లో మంచి రిజల్ట్స్ సాధించేందుకు వచ్చే ఐదు నెలలు కీలకం. అందుకు టీచర్ల అటెండెన్స్ ను నిత్యం ట్రాక్ చేయడంతో పాటు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కు బాగా ప్రిపేర్ చేయడంపై ఫోకస్ చేస్తాం. - అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం కలెక్టర్