ముంబైలో ఆటమ్​ ఈవీ చార్జింగ్ స్టేషన్‌‌

ముంబైలో ఆటమ్​ ఈవీ చార్జింగ్ స్టేషన్‌‌

హైదరాబాద్​, వెలుగు:  విశాక గ్రూపుకు చెందిన ఎలక్ట్రిక్​ వెహికల్స్​ కంపెనీ ఆటమ్​ చార్జ్ ముంబైలోని మలాడ్​లో ఈవీ చార్జింగ్​ స్టేషన్​ను ఏర్పాటు చేసింది. సోలార్​ రూఫ్​ ద్వారా కరెంటు తీసుకొని నడిచే ఎలక్ట్రిక్ వెహికల్ యూనివర్సల్ చార్జింగ్ స్టేషన్ ఇది.   కో–-వర్కింగ్ స్పేస్‌‌గానూ పని చేస్తుంది. బండి చార్జ్​ అవుతున్న సమయంలో ఇక్కడే కూర్చొని పనిచేసుకోవచ్చు.  ఆటమ్​ చార్జ్​ ఇది వరకే దేశవ్యాప్తంగా 250 చార్జింగ్ స్టేషన్‌‌లను విజయవంతంగా ఇన్‌‌స్టాల్ చేసింది.  ఇందులో 5.2 కిలోవాట్స్ కెపాసిటీ గల ఆటమ్​ సోలార్ రూఫ్ ద్వారా బ్యాటరీలు చార్జ్​ అవుతాయి. ఆటమ్​ సోలార్​ ప్రపంచంలోనే మొదటిసారిగా సోలార్​ రూఫ్​ను తయారు చేసింది. అమెరికా, దక్షిణాఫ్రికాలో దీనికి పేటెంట్లు కూడా ఉన్నాయి.  యూనివర్సల్​ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ప్రారంభించడం ద్వారా ఆటమ్​ చార్జ్​ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తోంది. మిగతా కంపెనీలు ఈవీ చార్జింగ్​ స్టేషన్లు సాధారణ కరెంటును వాడుకుంటున్నాయి.  ఆటమ్​సోలార్​ మాడ్యూల్స్ రోజుకు 24 కిలోవాట్​అవర్స్,​ సంవత్సరానికి 8,760 కిలోవాట్​అవర్స్​ కరెంటును ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల పరోక్షంగా 51 చెట్లను నరికివేయకుండా కాపాడవచ్చు. అంతేగాక  4395 కిలోల మేర  కార్బన్​వాయువులను తగ్గించవచ్చు. మలాడ్‌‌లో తమ సరికొత్త ఈవీ చార్జింగ్ స్టేషన్‌‌ను ప్రారంభించడం గురించి విశాక జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గడ్డం మాట్లాడుతూ, “మా ఎక్స్​పర్టులు,  ఆర్​&డీ టీమ్​ సాయంతో మేం కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాం.

సోలార్​ ఎలక్ట్రిక్​ చార్జింగ్​ స్టేషన్ల ద్వారా ముంబైలో పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు మనం మరింత పర్యావరణ స్పృహతో ఉండాలి.  వాతావరణ సమస్యల గురించి ప్రజల్లో ఇప్పటికే చాలా అవగాహన వచ్చింది. సోలార్​స్టేషన్ల ఏర్పాటు ద్వారా పచ్చదనం, ఆరోగ్యకరమైన భారతదేశం అనే మా టార్గెట్​ వైపు మరో అడుగువేశాం. ఈ విజయానికి గుర్తుగా కంపెనీ పూజా వేడుకలనూ నిర్వహించింది. దీని తర్వాత భారీ ప్రారంభోత్సవం ఉంటుంది”అని అన్నారు. ఈ పూజలో విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జేపీ రావుతో పాటు విశాక ఎంప్లాయీస్​ పాల్గొన్నారు.