- 15 ఏండ్లుగా 533 కుటుంబాల ఎదురుచూపులు
- నమ్మించి మోసం చేయడంతో న్యాయం కోసం పోరుబాట
కరీంనగర్, వెలుగు: దేశం కోసం సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడిన సైనికులు వారు.. రాత్రి..పగలు నిద్రాహారాలు మాని దేశ సేవ చేశారు. అయినా వారికి ఉండడానికి ఇల్లు లేకుండా పోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మాజీ సైనికులు, వారి కుటుంబాల్లోని వితంతువులు.. మొత్తం 533 కుటుంబాలకు 15 ఏండ్ల కింద అప్పటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కింద ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. డిపాజిట్ రూపంలో వీరి నుంచి డబ్బులు కూడా తీసుకుని రైతుల నుంచి భూమిని తీసుకున్న సర్కారు వీరికి మాత్రం కేటాయించలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా తమ కల నెరవేరుతుందనుకుంటే నిరాశే మిగిలింది. పైగా వీరి డబ్బులతో కొన్న స్థలాలను వేలం వేయడానికి సిద్ధమవుతోంది. దీంతో న్యాయం కోసం పోరుబాట పట్టారు.
లబ్ధిదారుల డబ్బుతో 87 ఎకరాలు కొన్న సర్కారు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ శివారు రామకృష్ణ కాలనీలో పేద, మధ్య తరగతి వారికి సొంతిండ్లు కట్టిస్తామంటూ అప్పటి కాంగ్రెస్ సర్కారు 87 ఎకరాలు సేకరించింది. డిపాజిట్ల రూపంలో సుమారు 6 వేలకు పైగా లబ్ధిదారుల నుంచి రూ. 5 వేల చొప్పున రూ. 4 కోట్లు తీసుకుంది. ఇందులోంచి రూ. 2 కోట్లు భూములు కోల్పోయిన రైతులకు పరిహారంగా ఇచ్చారు. మిగిలిన రూ. 2 కోట్లు రాజీవ్ గృహకల్ప కార్పొరేషన్ దగ్గర ఉన్నాయి. 2007లో డిపాజిట్లు కడితే.. 2008లో రైతులకు పరిహారం అందించారు. ఈ మొత్తం ప్రాజెక్టు మూడేండ్లలో పూర్తవ్వాల్సి ఉంది. డిపాజిట్ చెల్లించిన వారందరికీ నిర్ణయించిన కేటగిరీల వారీగా ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. 2009లో మల్టీ ఫుల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం అపార్ట్మెంట్పనులను కాంట్రాక్టర్ ప్రారంభించారు. అయితే ముందుగా ఇండిపెండెంట్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన అధికారులు అపార్ట్మెంట్లు కడుతుండడంతో లబ్ధిదారులు తిరస్కరించారు. అప్పటి నుంచి 2012 వరకు తర్జనభర్జన జరిగింది. కరీంనగర్ ప్రాజెక్టును యథాస్థితిలో అమ్మేయాలని 2013లో జీఓ 11 విడుదల చేశారు. ఈ జీఓ ప్రకారం అప్పటి ఎండీ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ పత్రికా ప్రకటన ఇచ్చారు. హౌసింగ్ లోన్ ఇప్పిస్తామని ఆఫీసర్లు చెప్పడంతో రూ. 5 వేలు కట్టామని, సర్కారు మాట మార్చిందని మాజీ సైనికులు హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో 2013లో 533 మాజీ సైనికుల కుటుంబాలకు స్థలాలు కేటాయించాలని జీఓ ఇచ్చారు. 25 శాతం అమౌంట్ చెల్లించాలనడంతో అంతా కలిసి రూ. 2 కోట్లు ఇచ్చారు. తర్వాత సర్కారు మారడంతో విధానాలు మారాయి. ప్రభుత్వం వీరికి స్థలం కేటాయించకపోవడంతో చెక్కులు రిటర్న్ చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంతో 2015లో కేవలం 36 ప్లాట్లు అలాట్ చేశారు. అయితే కాగితాల మీదే తప్పితే మోఖా మీద ప్లాట్ ఎక్కడ ఉందో చూపించలేదు. అందరితోపాటే వారికీ ఇస్తామని చెప్పారు. 2015లో రాజీవ్ స్వగృహ ఎండీ 21 ఎకరాలు అలాట్ చేయాలని ప్రభుత్వానికి లెటర్ రాశారు. కానీ ఇప్పటివరకు ఏ లబ్ధిదారుడికి ప్లాట్ కేటాయించలేదు. 15 ఏండ్లుగా తిరుగుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదు.
భూముల వేలానికి రెడీ
మాజీ సైనికులకు జాగాలు ఇవ్వకపోగా, వీరి డబ్బులతో కొన్న భూములను వేలం వేసేందుకు ప్రస్తుతం సర్కారు రెడీ అవుతోంది. తిమ్మాపూర్లోని మొత్తం 237 ప్లాట్లను వేలానికి రంగం సిద్ధం చేసింది. ఇందులో ఇండ్ల ప్లాట్లకు గజానికి రూ. 6 వేలు, కమర్షియల్ ప్లాట్లకు రూ. 8 వేలుగా నిర్ధారించింది. అయితే తమ డిపాజిట్ డబ్బులతో భూములు కొని.. రేట్లు పెరిగాయని వేలం వేయాలని చూడడం ఏమిటని మాజీ సైనికులు మండిపడుతున్నారు. వేలానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతుండడంతో ఆందోళనకు దిగారు. తమకు 21 ఎకరాలు కేటాయించాల్సిందేనంటూ మూడు రోజులుగా కలెక్టరేట్ఎదుట దీక్షలు చేస్తున్నారు.
డిపాజిటర్లకే దక్కాలి
రాష్ట్రంలో మిగతా చోట్ల భూములు అమ్మడం వేరు.. కరీంనగర్ లో అమ్మడం వేరు. ఇక్కడ 15 ఏండ్ల కింద డిపాజిట్ల ద్వారా సేకరించిన అమౌంట్ తో రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారు. ఇందులో మా భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ భూములతో మీకు సంబంధం లేదు. మీ డిపాజిట్లు మీకిస్తం అంటే ఏమన్నట్లు. మా సంగతి తేల్చిన తర్వాత భూముల వేలం గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే మూడు రోజులుగా దీక్షలు చేస్తున్నాం. మా విషయం తేలేవరకు దీక్షలు కొనసాగిస్తాం.
– రంగారెడ్డి, మాజీ సైనికుల హౌసింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, కరీంనగర్
