
ఫ్రెండ్షిప్.. ఈ ప్రపంచంలో కులం, మతం, లింగం, ప్రాంతం, ఆస్తి, అంతస్తు.. ఇలా ఎలాంటి అడ్డుగోడలు లేని ఒకే ఒక్క రిలేషన్షిప్ అంటే అతిశయోక్తి కాదు. నిస్వార్థంతో మొదలైన స్నేహం.. జీవితాంతం ఒకరికి ఒకరై పయనిస్తూనే ఉంటుంది. అందుకే అన్నారేమో.. పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా.. అని. ఈ ప్రపంచంలో రిలేటివ్స్ లేని వాళ్లుంటారేమో కానీ.. ఫ్రెండ్స్ లేని వాళ్లు ఉండరు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వ్యక్తులను.. ఏదో ఒకచోట ఎలా కలుపుతుందో తెలియదు. కొన్నిసార్లు ప్రాణం ఇచ్చేంత గొప్ప బంధంగా బలపడుతుంది స్నేహం. ఆగస్టు నెల మొదటి ఆదివారం.. 3వ తేదీ ఫ్రెండ్ షిప్ డే. ఈ సందర్భంగా ఫ్రెండ్ షిప్ డే చరిత్ర, ప్రాముఖ్యత మొదలైన అంశాలను గురించి తెలుసుకుందాం.
ఫ్రెండ్ షిప్డేని ఎందుకు జరుపుకోవాలి:
ఫ్రెండ్షిప్ డే ను కొందరు చాలా ప్రత్యేకంగా, చాలా పెద్ద ఈవెంట్స్ చేస్తూ జరుపుకుంటుంటారు. కొందరు సింపుల్ గా చిన్న కేక్ కట్ చేసి జరుపుకుంటుంటారు. కొందరు తమకు ఇష్టమైన స్నేహితులకు మెసేజ్ లు.. ఫోన్లు చేసి విష్ చేసుకుంటారు. మరికొందరు ఎవరికీ విషెస్ చెప్పకపోయినా సోషల్ మీడియాలో హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అని స్టేటస్ అప్డేట్ చేస్తుంటారు. ఎవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా.. ఆ మనుసుల్లో ఉన్న స్నేహానికి ఉన్న స్థానాన్ని కొలిచేందుకు ఎలాంటి తూనికలు లేవనే చెప్పాలి.
అసలు ఫ్రెండ్ షిప్ డే ఎందుకు చేసుకోవాలి.. అనే ప్రశ్న మనకు మనం వేసుకున్నప్పుడు దానికి సమాధానం కూడా మనమే చెప్పుకోవాలి. ప్రతీది ఒక డే అంటూ సెలబ్రేషన్స్ ఎక్కువై పోయాయి అనే వాళ్లు ఎందరున్నా.. ఫ్రెండ్ షిప్ డేను మాత్రం అనటానికి ముందుకురారేమో. ఫ్రెండ్షిప్ డే సెలెబ్రేట్ చేసుకోవడానికి మనకు మనంగా చెప్పుకోవాల్సిన ఏకైక కారణం.. ఇష్టమైన స్నేహితులను గుర్తు చేసుకోవడం. నేనున్నాను అని మిత్రులకు భరోసా ఇవ్వడం. నా ఆత్మీయులు మీరే అని విషెస్ రూపంలో చెప్పడం. ఇది చాలదా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి.
ఫ్రెండ్షిప్ డే చరిత్ర ఏమిటి..?
స్నేహితుల దినోత్సవం అనే ఐడియా 1950 లో అమెరికాలో మొదలైంది. హాల్ మార్క్ కార్డ్స్ స్థాపించిన జోయిస్ హాల్ ఈ ఆలోచనకు పునాది వేశారు. ఏ డేట్ అనేది పర్టిక్యులర్ గా లేకపోయినా.. ఐడియా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది.
ఇండియాలో దోస్తుల దినోత్సవాన్ని ఆగస్టు నెలలో మొదటి ఆదివారంగా జరుపుకుంటారు. ఆ రోజు చాలా ప్రశాంతంగా, స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ గడుపుకుంటారు. దీని వలన స్ట్రెస్ అంతా పోయి నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారనే భరోసా, సంతృప్తి కలుగుతుందని చెబుతున్నారు సైకాలజిస్టులు.
అయితే ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని యూనైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్య సమితి) 2011 లో స్వీకరించింది. ప్రపంచ శాంతి, ఐక్యత లో భాగంగా స్నేహితుల దినోత్సవాన్ని స్వీకరించినట్లు పేర్కొంది. జులై 30 తేదీని ఫ్రెండ్ షిప్ డే గా స్వీకరించినా.. వివిధ దేశాల్లో స్థానికంగా ఉన్న సంస్కృతిలో భాగంగా నచ్చిన తేదీల్లో జరుపుంటున్నారు.
ఫ్రెండ్షిప్ డే ఎలా ప్లాన్ చేసుకోవాలి?
ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చాలా బిజీ అయిపోయారు. సిటీ లైఫ్ లో ఎప్పుడు చూసినా ఉరుకులు పరుగులు నిండిన జీవితమే. అయితే ఫ్రెండ్ షిప్ డే కు ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆ రోజు చాలా సంతృప్తికరమైన రోజుగా ముగించవచ్చు. అందుకోసం ముందుగా బిజీనెస్ ను పక్కన పెట్టాలి. ఫ్రెండ్స్ తో మాట్లాడి ఎక్కడ, ఎలా అనేది ప్లాన్ చేసుకోవాలి.
వీలైతే ఫ్రెండ్స్ తో గెట్ టు గెదర్ ప్లాన్ చేయడం మంచిది. దీనితో ఫ్రెండ్స్ మధ్య ఉన్న మధుర జ్ఞాపకాలను రికలెక్ట్ చేసుకోవచ్చు. రిలాక్స్ గా ఒక రోజంతా లేదా.. కొన్ని గంటలు స్పెండ్ చేయడం వలన పాత జ్ఞాపకాలతో పాటు మన బలాలు బలహీనతలు కూడా నెమరులోకి వస్తాయి. అందరూ ఒక చోట కలవడం వలన కొత్త వైబ్రేషన్స్, కొత్త శక్తి తెలియకుండానే వస్తుంది. నచ్చిన ఫ్రెండ్స్ కు వీలైతే సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేయడం మంచిది. రాత్రి సినిమాకు వెళ్లి కూడా సరదగా గడపవచ్చు.
అయితే ఫ్రెండ్షిప్ డే పేరున ఓవర్ నైట్ పార్టీలు, హెవీ డ్రింకింగ్ ను కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఓవర్ డ్రింకింగ్ వలన హెల్త్ పాడవ్వటం, మరుసటి రోజుపై ఎఫెక్ట్ పడటం జరగవచ్చు. కొన్నిసార్లు ఫ్రెండ్స్ కు ఇష్టం లేని అంశాలను డిస్కషన్ లోకి తీసుకువచ్చి అది గొడవకు కూడా దారి తీయవచ్చు. అందుకోసం.. ఫ్రెండ్స్ కు ఇష్టం లేని అంశాలను.. మనసుకు హాని కలిగించే టాపిక్స్ ను తీసుకురాకపోవడం బెటర్. ఏదేమైనా.. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి.. చెడ్డీ ఫ్రెండ్స్ నుంచి ఆఫీస్ ఫ్రెండ్స్ వరకు కలుసుకునే అకవాశం.. లేదంటే మాట్లాడే అవకాశం ఈ ఒక్కరోజైనా కల్పించుకోవడం మంచిది. మీరు కూడా వీలైతే మీ ఫ్రెండ్స్ లిస్ట్ ను రెడీ చేసుకుని ప్లాన్ చేసుకోండి.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దోస్తులూ..!