విమెన్స్ వరల్డ్ కప్: వికెట్‌‌‌‌ పడకుండానే.. బంగ్లాదేశ్‌‌‌‌పై ఆసీస్ గెలుపు..

విమెన్స్ వరల్డ్ కప్: వికెట్‌‌‌‌ పడకుండానే.. బంగ్లాదేశ్‌‌‌‌పై ఆసీస్ గెలుపు..
  • అలీసా హీలీ సూపర్‌‌‌‌ సెంచరీ
  •     రాణించిన లిచ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌, బౌలర్లు

విశాఖపట్నం: ఆల్‌‌‌‌ రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా విమెన్స్‌‌‌‌ జట్టు.. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో నాలుగో విజయాన్ని అందుకుంది. టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ అలీసా హీలీ (77 బాల్స్‌‌‌‌లో 20 ఫోర్లతో 113 నాటౌట్‌‌‌‌) వరుసగా రెండో సెంచరీతో చెలరేగడంతో పాటు ఫోబీ లిచ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ (72 బాల్స్‌‌‌‌లో 12 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 84 నాటౌట్‌‌‌‌) దుమ్మురేపడంతో.. గురువారం (అక్టోబర్ 16) జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌ 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌ను చిత్తు చేసింది. 

ఫలితంగా ఆడిన ఐదు మ్యాచ్‌‌‌‌ల్లో నాలుగు విజయాలతో 9 పాయింట్లు సాధించిన కంగారూలు సెమీస్‌‌‌‌ వైపు భారీ అడుగు వేశారు. టాస్‌‌‌‌ గెలిచిన బంగ్లాదేశ్‌‌‌‌ 50 ఓవర్లలో 198/9 స్కోరు చేసింది. శోభన మోస్ట్రే (80 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లతో 66 నాటౌట్‌‌‌‌) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. రుబయా హైదర్‌‌‌‌ (44) ఫర్వాలేదనిపించింది. తర్వాత ఆస్ట్రేలియా 24.5 ఓవర్లలో 202/0 స్కోరు చేసి ఈజీగా నెగ్గింది.

 ఆరంభం నుంచే బంగ్లా బౌలింగ్‌‌‌‌పై పూర్తి ఆధిపత్యం చూపెట్టిన ఓపెనర్లు హాలీ, లిచ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ స్ట్రోక్స్‌‌‌‌లో ఎక్కడా తడబడలేదు. ప్రతి ఓవర్‌‌‌‌లో వరుస ఫోర్లతో ఇద్దరూ రెచ్చిపోయారు. కనీసం స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారని భావించినా వాళ్లపై కూడా ఎదురుదాడికి దిగి సగం ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు. అలనా కింగ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

బౌలింగ్‌‌‌‌ అదుర్స్‌‌‌‌..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన బంగ్లాను ఆసీస్‌‌‌‌ బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. ఫలితంగా శోభన, హైదర్‌‌‌‌ మినహా మిగతా బ్యాటర్లు  స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేయడానికి కూడా ఇబ్బందిపడ్డారు. ఓపెనింగ్‌‌‌‌లో ఫర్జానా హక్‌‌‌‌ (8) విఫలమైనా.. హైదర్‌‌‌‌ రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. ఆరంభం నుంచే బౌండ్రీల వైపు మొగ్గిన హైదర్‌‌‌‌ కంగారుల బౌలింగ్‌‌‌‌ను దీటుగా ఆడింది. దాంతో తొలి 9 ఓవర్లలో హక్‌‌‌‌తో కలిసి తొలి వికెట్‌‌‌‌కు 32 రన్స్‌‌‌‌ జత చేసింది. తర్వాత షర్మిన్‌‌‌‌ అక్తర్‌‌‌‌ (19) ఉన్నంతసేపు అండగా నిలిచింది. కానీ డిఫెన్స్‌‌‌‌కు ప్రాధాన్యమివ్వడంతో రన్స్‌‌‌‌ చేయడంలో విఫలమైంది. 

ఈ క్రమంలో గార్డ్‌‌‌‌నర్‌‌‌‌ (2/49) వేసిన ఔట్‌‌‌‌సైడ్‌‌‌‌ ఎడ్జ్‌‌‌‌ బాల్‌‌‌‌ను ఆడే క్రమంలో హైదర్‌‌‌‌..  మిడాన్‌‌‌‌లో తహ్లియా మెక్‌‌‌‌గ్రాత్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చింది. రెండో వికెట్‌‌‌‌కు 41 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన శోభన ఆసీస్‌‌‌‌ బౌలర్లకు కళ్లెం వేసే ప్రయత్నం చేసింది. అయితే 22వ ఓవర్‌‌‌‌లో గార్గ్‌‌‌‌నర్‌‌‌‌ బంతిని బలంగా కొట్టిన షర్మిన్‌‌‌‌ మిడాన్‌‌‌‌లో సదర్లాండ్‌‌‌‌కు సింపుల్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ ఇచ్చింది. 84/3తో కష్టాల్లో పడిన బంగ్లాను శోభన ఆదుకునే ప్రయత్నం చేసినా ఆసీస్‌‌‌‌ బౌలర్లు చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. 

రెండో ఎండ్‌‌‌‌లో వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. షోర్నా అక్తర్‌‌‌‌ (7), రితూ మోనీ (2), ఫహిమా ఖాతున్‌‌‌‌ (4), రబేయా ఖాన్‌‌‌‌ (6), నిషితా అక్తర్‌‌‌‌ నిషి (1), ఫరిహా త్రిస్నా (1 నాటౌట్) సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితం కావడంతో బంగ్లా స్కోరు 200లు కూడా దాటలేదు. అలనా కింగ్‌‌‌‌, సదర్లాండ్​, జార్జియా వేర్‌‌‌‌హామ్‌‌‌‌ తలా రెండు వికెట్లు తీశారు. 

సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్‌‌‌‌: 50 ఓవర్లలో 198/9 (శోభన 66*, రుబయా హైదర్‌‌‌‌ 44, గార్డ్‌‌‌‌నర్‌‌‌‌ 2/49, అలనా కింగ్‌‌‌‌ 2/18). ఆస్ట్రేలియా: 24.5 ఓవర్లలో 202/0 (అలీసా హీలీ 113*, లిచ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ 84*).