ఆస్ట్రేలియా హోం మంత్రికి కరోనా: వారం క్రితమే ఇవాంకాతో భేటీ

ఆస్ట్రేలియా హోం మంత్రికి కరోనా: వారం క్రితమే ఇవాంకాతో భేటీ

ఆస్ట్రేలియా హోం మంత్రి పీటర్ డ్యూటన్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే జ్వరం, గొంతులో గరగర అనిపించింది. వెంటనే క్వీన్స్‌లాండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లాను. అక్కడ డాక్టర్లు నాకు కరోనా టెస్టులు చేశారు. నాకు వైరస్ సోకినట్లు మధ్యాహ్నానికి రిపోర్టులు వచ్చాయి. డాక్టర్ల సూచనతో హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నా’’ అని శుక్రవారం మధ్యాహ్నం ట్విట్టర్ ద్వారా తెలిపారు పీటర్. క్వీన్స్‌లాండ్‌లోని బ్రిస్బేన్ హాస్పిటల్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ దేశ హోం శాఖ ప్రకటించింది.

గత శుక్రవారం ఇవాంకాతో భేటీ

ఆస్ట్రేలియా హోం మంత్రి పీటర్ వారం క్రితమే అమెరికాలో పర్యటించారు. గత శుక్రవారం యూఎస్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. పిల్లలపై ఇంటర్నెట్ వేదికగా జరుగుతున్న పోర్న్, ఇతర క్రైమ్స్‌ అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఇవాంకా ట్రంప్‌తో బేటీ అయ్యారు. ఈ సందర్బంగా టెక్నాలజీ సాయంతో ఆ నేరాలను అరికట్టేందుకు పరస్పర సహకారం అందించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే ఇవాంకాను కలిసి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిన పీటర్‌కు కరోనా ఉన్నట్లు తేలడంతో వైట్‌హౌస్ వర్గాలు కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.