మహిళల టీ20 ప్రపంచ కప్‌‌ ఫైనల్లో ఆస్ట్రేలియా.. సెమీఫైనల్‌‌లో వెస్టిండీస్‌‌పై ఘన విజయం

మహిళల టీ20 ప్రపంచ కప్‌‌ ఫైనల్లో ఆస్ట్రేలియా.. సెమీఫైనల్‌‌లో వెస్టిండీస్‌‌పై ఘన విజయం
  •     126 పరుగులకే 
  • కుప్పకూలిన విండీస్‌‌
  •     13 ఓవర్లలోనే టార్గెట్ ఊదిపారేసిన ఆస్ట్రేలియా
  •     బెత్ హాఫ్ సెంచరీతో విధ్వంసం..
  • గార్డనర్ ఆల్‌‌రౌండ్ షో
  •     7వ టైటిల్ సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో ఆసిస్

లండన్‌‌: మహిళల టీ20 ప్రపంచ కప్‌‌లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. లండన్‌‌లోని ది ఓవల్ వేదికగా మంగళవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు టీ20 ప్రపంచ కప్‌‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.

విండీస్‌‌ బ్యాటర్లలో కెప్టెన్‌‌ హీలీ మాథ్యూస్‌‌(30) టాప్‌‌ స్కోరర్‌‌గా నిలవగా.. డాటిన్‌‌(26) ఆఖరిలో బ్యాట్ ఝుళిపించింది.  ఆసీస్‌‌ బౌలర్లలో సోఫీ మోలినెక్స్, గార్డెనర్‌‌, జార్జియా వేర్‌‌హామ్ తలా రెండు వికెట్లు సాధించారు. వెస్టిండీస్ బ్యాటర్లందరినీ ఆస్ట్రేలియా బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. వెస్టిండీస్ నిర్దేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు కేవలం 13 ఓవర్లలోనే ఛేదించింది. 

ఇంకా 7 ఓవర్లు (42 బంతులు) మిగిలి ఉండగానే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 127 పరుగులు సాధించింది. ఛేజింగ్‌‌లో భాగంగా ఏడో ఓవర్‌‌లో ఓపెనర్ బెత్ మూనీ, యాష్ గార్డనర్ జతకట్టారు. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ గ్రౌండ్ నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు. ఈ జోడీ కేవలం 37 బంతుల్లోనే అజేయంగా 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చింది. 

వెస్టిండీస్ బౌలర్లలో చినెల్ హెన్రీ, హేలీ మాథ్యూస్‌‌లకు తలా ఒక వికెట్ దక్కింది. ఇక ఆల్‌‌రౌండ్ ప్రదర్శనతో 35 పరుగులు, 2 వికెట్ల తీసిన ఆష్లీ గార్డనర్‌‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో 6 సార్లు ఛాంపియన్‌‌గా నిలిచిన ఆస్ట్రేలియా మరోసారి పొట్టి ప్రపంచకప్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

బెత్ మూనీ విధ్వంసం

ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ కేవలం 36 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మహిళల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో మూనీకి ఇది ఎనిమిదో అర్ధసెంచరీ కావడం విశేషం. దీనితో న్యూజిలాండ్ ప్లేయర్ సూజీ బేట్స్ పేరిట ఉన్న అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డును ఆమె సమం చేసింది. మరోవైపు, బెత్ మూనీకి చక్కని సహకారం అందించిన యాష్ గార్డనర్ 20 బంతుల్లోనే 35 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. 

ఈ టోర్నమెంట్‌‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌‌లో కూడా ఓడిపోని ఆస్ట్రేలియా..తాజా విజయంతో మొత్తం 10 మహిళల టీ20 వరల్డ్ కప్‌‌ టోర్నీల్లో ఎనిమిదోసారి ఫైనల్‌‌కు చేరి రికార్డు సృష్టించింది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడనుండగా, అందులో గెలిచిన జట్టుతో ఆస్ట్రేలియా ఫైనల్లో తలపడుతుంది. వచ్చే ఆదివారం లార్డ్స్ మైదానంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌‌లో తన ఏడో ప్రపంచ కప్ టైటిల్ కోసం ఆస్ట్రేలియా పోటీ పడుతుంది.