టీ20 వరల్డ్ కప్ : ఇంగ్లాండ్ విన్.. టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్

టీ20 వరల్డ్ కప్ : ఇంగ్లాండ్ విన్.. టోర్నీ నుంచి ఆస్ట్రేలియా  ఔట్

టీ20 వరల్డ్ కప్లో శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 141 రన్స్ చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడు 45 బాల్స్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు తీశాడు. స్టోక్స్, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ దక్కించుకున్నారు.

మరోవైపు 142 రన్స్ టార్గెట్ సాధించడంలో ఇంగ్లండ్ తడబడింది. ఓపెనర్లు జోస్ బట్లర్ 23 బాల్స్ లో 28 రన్స్, అలెక్స్ హేల్స్ 30 బాల్స్ లో 47 రన్స్ చేసి మంచి ఆరంభం ఇచ్చారు. అయితే ఓపెనర్లు ఇచ్చిన ఆరంభాన్ని తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ సద్వినియోగం చేసుకోలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోయారు. దీంతో ఇంగ్లాండ్ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే బెన్ స్టోక్స్ 36 బాల్స్లో 42 రన్స్తో నాటౌట్గా నిలిచి ఇంగ్లాండ్ను గెలిపించాడు. శ్రీలంక బౌలర్లలో లహీర్ కుమార, హసరంగ, ధనంజయ డిసిల్వా చెరో 2 వికెట్లు తీశారు. 

శ్రీలంకపై ఇంగ్లాండ్ విజయంతో మెరుగైన రన్ రేట్ లేక ఆస్ట్రేలియా సెమీస్ వెళ్లలేకపోయింది. గ్రూప్- 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ చేరాయి. గ్రూప్1 లో ఈ రెండు జట్లతో పాటు ఆస్ట్రేలియాకు 7 పాయింట్లు ఉన్నాయి. కానీ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లకు ఆస్ట్రేలియా కంటే ఎక్కువ రన్ రేట్ ఉండడంతో సెమీస్ అవకాశం కోల్పోయింది.