
వాషింగ్టన్ : ఆస్ట్రేలియాకు 220 టొమహాక్ దీర్ఘశ్రేణి క్రూజ్‌క్షిపణులను కూడా సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది. ఇటీవల ఆకస్ కూటమి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 2030 ప్రారంభం నుంచి అమెరికా మూడు వర్జీనియా తరగతి జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు విక్రయిస్తుంది. ఈ డీల్ విలువ 895 మిలియన్ డాలర్లు అని అమెరికాలోని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
కాగా దీనిపై ఆస్ట్రేలియా రక్షణశాఖ మంత్రి పాట్ కాన్రే స్పందించారు. ‘2033 నాటికి ఆస్ట్రేలియాకు తొలి మూడు వర్జీనియా శ్రేణి సబ్‌మెరైన్లు అందుతాయి. అప్పటికి టొమహాక్ క్షిపణులు కూడా దళాలకు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి ఆకస్ ఒప్పందం జరిగిన తొలినాళ్లలోనే టొమహాక్ క్షిపణులను ఆస్ట్రేలియా తమ నౌకాదళంలోని హోబర్ట్ శ్రేణి డెస్ట్రాయర్లలో అమర్చాలని భావించింది. తాజా తమ కల సాకారం కాబోతోంది’అని తెలిపారు.