అమృత్‌సర్: మెల్‌బోర్న్‌కు చెందిన 66 ఏళ్ల ఆస్ట్రేలియా పౌరుడు పంజాబ్‌లో కనిపించకుండా పోయారు. ఏబీసీ న్యూస్ నివేదిక ప్రకారం.. డైమండ్ వ్యాలీ కాలేజీలో గణిత టీచర్ సునీల్ శర్మ, అమృత్‌సర్ ఫతేగఢ్ చురియన్ రోడ్‌లోని తన ఆస్తిని అమ్మేందుకు భారత్‌కు వచ్చారు. ఈ నెల 22న కుటుంబ సభ్యులకు చివరిసారిగా ఫోన్ చేశారు. ఆ మరుసటి రోజు నుంచి ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.
మొహాలీ నుంచి అమృత్‌సర్‌కు శర్మ కారులో వెళ్తుండగా అదృశ్యం కావడంతో కుటుంబీకులు ఆందోళనకు గురవుతున్నారు. విషయం తెలిసి స్నేహితులు శర్మ ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. చివరిసారిగా ఆ ఇంటి వద్ద కనిపించిన శర్మ సోదరుడి కోసం, అలాగే ఇల్లు చూడటానికి వచ్చిన కొనుగోలుదారుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. శర్మ స్నేహితుడి ఫిర్యాదు మేరకు అమృత్‌సర్ రూరల్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
