
కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఎమ్మా మెక్‌కీన్ జోరు కొనసాగిస్తోంది. ఎనిమిది ఈవెంట్లలో మెక్‌కీన్ పతకాల పంట పండిస్తోంది. ఉమెన్స్ 50మీటర్ల ఫ్రీస్టైల్‌లో ఆస్ట్రేలియా స్వీప్‌కు సారథ్యం వహించిన మెక్‌కీన్.. రికార్డు స్థాయిలో 12వ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. కామన్ వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన లీసెల్ జోన్స్, ఇయాన్ థోర్ప్, సూసీ ఓ నీల్ ముగ్గరు 10 గోల్డ్ మెడల్స్ చొప్పున సాధించగా...ఈ రికార్డును మెక్‌కీన్ అధిగమించి చరిత్ర సృష్టించింది.
స్వర్ణ మెక్‌కీన్..
బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్‌లో మిక్స్‌డ్ 4(100) ఫ్రీస్టైల్, ఉమెన్స్ 4(100) ఫ్రీస్టైల్ రిలేలలో ఎమ్మా మెక్‌కీన్ స్వర్ణ పతకాలను సాధించింది. ఆ తర్వాత 50మీటర్ల విభాగంలో మరో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో పాటు 50మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలోనూ విజయం సాధించి నాలుగో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో కామన్వెల్త్ క్రీడల కెరీర్‌లో తన 17వ పతకాన్ని దక్కించుకుంది. అలాగే కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో 12 గోల్డ్ మెడల్స్ సాధించిన అథ్లెట్ గానూ నిలిచింది. అంతేకాకుండా కామన్ వెల్త్ గేమ్స్ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన నాలుగో అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. ఈమె కంటే ముందు ఇంగ్లీష్ షూటర్ మిక్ గాల్ట్, దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాడ్ లే క్లోస్, ఆస్ట్రేలియన్ షూటర్ ఫిలిప్ ఆడమ్స్ 18పతకాలతో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారులుగా మొదటి స్థానంలో ఉన్నారు.
సవాలును స్వీకరిస్తా..
కామన్వెల్త్ గేమ్స్ లో రికార్డు స్థాయిలో 12 గోల్డ్ మెడల్స్ గెలుచుకోవడంపై ఎమ్మా మెక్‌కీన్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ టోర్నీలో అయినా తాను సవాలును స్వీకరిస్తానని వెల్లడించింది. పతకాలు గెలిచేందుకు అదే స్పూర్తి అని చెప్పుకొచ్చింది. కామన్ వెల్త్ గేమ్స్ .. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధం కావడానికి ఉపయోగపడుతున్నట్లు చెప్పింది. పారిస్ ఒలింపిక్స్‌లో తనకు విపరీతమైన పోటీ ఉంటుందని..వారిని ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించాలంటే ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని తెలిపింది. ఈ కామన్వెల్త్ గేమ్స్ తనకు ఆత్మవిశ్వాసాన్ని కూడబెట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయని ఎమ్మా మెక్‌కీన్ పేర్కొంది.
టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు..
టోక్యో ఒలింపిక్స్ 2020లో ఎమ్మా మెక్‌కీన్ ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. మొత్తం ఏడు విభాగాల్లో ఏడు పతకాలు సాధించింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, మూడు క్యాంస్యాలు ఉన్నాయి. 100 ఫ్రీస్టైల్, 4x100 ఫ్రీస్టైల్ రిలే , 50 ఫ్రీస్టైల్, 4x100 మెడ్లీరిలేల్లో స్వర్ణం గెలిచిన ఎమ్మా మెక్‌కిన్.. 100 బటర్‌ఫ్లై, 4x200 ఫ్రీస్టైల్ రిలే, 4x100 మిక్స్‌డ్ మెడ్లీరిలే విభాగాల్లో క్యాంస్య పతకాలను గెలిచింది.