స్థలాలు కొట్టేసేందుకు స్కెచ్! .. నిర్వాసితుల ముసుగులో బీఆర్ఎస్ కార్యకర్తలు

స్థలాలు కొట్టేసేందుకు స్కెచ్! .. నిర్వాసితుల ముసుగులో బీఆర్ఎస్ కార్యకర్తలు
  •   ఎమ్మెల్యే వనమా పేరు చెబుతున్న కొందరు నేతలు
  •     తలలు పట్టుకొంటున్న ఆఫీసర్లు  

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెంలో త్వరలో భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఇదే అదునుగా కొందరు బీఆర్ఎస్ ​నేతలు కార్యకర్తలకు స్థలాలు ఇప్పించేందుకు స్కెచ్​వేశారు. ఎన్నికల టైంలో ఇండ్లు లేని కార్యకర్తలకు నిర్వాసితులతో కలిపి స్థలాలు ఇప్పిస్తే తమకు కలిసొస్తుందని ప్లాన్​చేశారు. ఇప్పటికే తప్పుడు డాక్యుమెంట్లతో ఆఫీసర్లను కలిసి నిర్వాసితులమని చెప్పుకున్నారు. అధికారుల వద్ద ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేరును వాడుకున్నారు. 100 మందికి పైగా నిర్వాసితులు కానివారు అప్లికేషన్లు అందజేసినట్లు తెలిసింది. దీంతో ఆఫీసర్లకు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

అందరికీ ఒకేచోట..

కొత్తగూడెం ఏరియా చుంచుపల్లి మండలంలోని మాయాబజార్, వనమా నగర్, ఎస్​ఆర్టీ ప్రాంతాలు సింగరేణి కాలరీస్ కంపెనీ కొత్తగా ఏర్పాటు చేయనున్న వీకే ఓసీలోకి పోనున్నాయి. ఇప్పటివరకు ఈ ఏరియాల్లో ఉంటున్న వారిని ప్రభుత్వం నిర్వాసితులుగా గుర్తించింది. కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్​సమీపంలోని గవర్నమెంట్​ల్యాండ్​లో ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు ఆఫీసర్లు నిర్ణయించారు. సింగరేణి ఆఫీసర్లతో కలిసి రెవెన్యూ ఆఫీసర్లు గతంలో ఇంటింటి సర్వే చేపట్టారు. మొదటి దశలో 180 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. తర్వాత మరోసారి సర్వే చేసిన ఆఫీసర్లు మొత్తం మూడు ప్రాంతాల్లో కలిపి 286 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. 

వీరితోపాటు కొత్తగూడెంలోని మేదరబస్తీ, తుమ్మలనగర్​ ప్రాంతాల్లో రెండేండ్ల కిందట రైల్వేశాఖ ఆక్రమణల పేర ఇండ్లను కూల్చిన వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆఫీసర్లు ప్లాన్​చేశారు. రైల్వే బాధితులు 120 మంది దాకా ఉన్నారు. ప్రస్తుతం అధికారులు చెబుతున్న ప్రకారం ఒక్కొక్కరికి 75 గజాల స్థలం రానుంది. నిర్వాసితులు 100 గజాలు ఇవ్వాలని కోరుతున్నారు. 

రెండ్రోజుల్లో పంపిణీ

ఒకట్రెండు రోజుల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వనున్న క్రమంలో కొత్తగా మరో వంద మందికి పైగా నిర్వాసితులు పుట్టుకొచ్చారు. కొందరు బీఆర్ఎస్, టీబీజీకేఎస్​లీడర్ల అండదండలతో వారి అనుచరులైన కార్యకర్తలు నిర్వాసితుల అవతారమెత్తారు. త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో తమ అనుచరులకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును కలిసినట్లు తెలిసింది. ఈ క్రమంలో చాలా మంది ఎమ్మెల్యే పేరు చెప్పి రెవెన్యూ ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తున్నారు. తామిచ్చిన లిస్టులోని పేర్లను నిర్వాసితుల జాబితాలో చేర్చాలని పట్టుబడుతున్నారు. పేర్లు చేర్చితే అసలైన నిర్వాసితులతో ఇబ్బందులు వస్తాయేమోనని, చేర్చకపోతే ఎమ్మెల్యే నుంచి ఎటువంటి ఒత్తిడి ఉంటుందో అని ఆఫీసర్లు సతమతం అవుతున్నారు. 

అర్హులను తొలగించారనే ఆరోపణలు

ఇప్పటికే మొదటి జాబితాలో ఉన్న పేర్లలోంచి కొన్ని పేర్లను తొలగించి అనర్హులను చేర్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారికున్న పలుకుబడితో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, భార్యాభర్తలు ఇద్దరి పేర్లను అర్హుల జాబితాలో చేర్చారనే ఆరోపణలున్నాయి.