ఉమ్మడి వరంగల్ లో వర్షాలు.. ఖమ్మంలో టెన్షన్..!

ఉమ్మడి వరంగల్ లో వర్షాలు.. ఖమ్మంలో టెన్షన్..!
  • గతేడాది మున్నేరు వరదతో మునిగిన ఖమ్మం పరిసరాలు
  •  ఆకేరు, మున్నేరు, పాలేరు క్యాచ్​ మెంట్ ఏరియా అక్కడే ఎక్కువ
  •  వేర్వేరుగా వచ్చి తీర్థాల దగ్గర మున్నేరులో ఆకేరు, బుగ్గేరు విలీనం
  •  అక్కడి వర్షాలు, వరద అంచనాపై ఇక్కడి ఆఫీసర్ల అలర్ట్

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు ఖమ్మం జిల్లా అధికారులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రెండు మూడ్రోజులుగా అక్కడ కురుస్తున్న వర్షాలతో ఏ వాగులో ఎంత వరద ప్రవాహం వస్తుందని ఖమ్మం జిల్లా ఆఫీసర్లు లెక్కలేసుకుంటున్నారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఖమ్మం జిల్లాలో ముంపు ప్రభావ గ్రామాలు, కాలనీల వాసులకు చేరవేస్తున్నారు. గతేడాది ఖమ్మం నగరంతో పాటు, రూరల్ మండలంలో పలు గ్రామాలను ముంచెత్తిన మున్నేరుకు ప్రధానంగా వరద ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే వస్తుంది.

జనగామ జిల్లా స్టేషన్​ ఘన్ పూర్ మండలం నష్కల్ చెక్​ డ్యామ్​ దగ్గర ప్రారంభమయ్యే ఆకేరు వాగు హనుమకొండ, వరంగల్ జిల్లా వర్థన్నపేట, మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు, డోర్నకల్ మీదుగా ప్రవహించి ఖమ్మం రూరల్ మండలం తీర్థాల దగ్గర మున్నేరులో కలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆకేరు మొత్తం 12 మండలాల్లోని గ్రామాల మీదుగా110 కిలోమీటర్లు ప్రవహించి ఆయా గ్రామాల్లోని చెరువుల మత్తళ్లు, చిన్న చిన్న వాగులను కలుపుకొని ఖమ్మం జిల్లాలో ప్రవేశిస్తుంది.

ఖమ్మం నగరాన్ని ఆనుకొని మున్నేరు ప్రవహిస్తుంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు దగ్గర పుట్టే బుగ్గవాగు కూడా కామేపల్లి మండలం మీదుగా ప్రవహించి తీర్థాల సమీపంలో మున్నేరులో కలుస్తోంది. ఇక పాలేరు వాగు కూడా జనగామ జిల్లా కొడకండ్ల బయ్యన్న రిజర్వాయర్ దగ్గర ప్రారంభమవుతుంది. మహబూబాబాద్​ జిల్లా పెద్దవంగర, తొర్రూరు, దంతాలపల్లి, మరిపెడ మీదుగా పాలేరు రిజర్వాయర్​ లో కలుస్తుంది. పాలేరు రిజర్వాయర్​ పొంగితే కూసుమంచి, నేలకొండపల్లి మీదుగా ఖమ్మం జిల్లాకు దిగువన మున్నేరులో కలుస్తుంది. 

గతేడాది పరిస్థితి మళ్లీ రాకుండా.. 

గతేడాది ఆగస్టు 31, సెప్టెంబర్​ 1న ఉమ్మడి వరంగల్ లో కురిసిన వర్షాలతో ఆకేరు, మున్నేరు ఉగ్రరూపంలో ప్రవహించాయి. గత 70 ఏండ్ల  ఎన్నడూ లేనివిధంగా ఖమ్మం కాల్వొడ్డు సమీపంలో దాదాపు 40 అడుగుల ఎత్తులో మున్నేరు ప్రవాహం ఉంది. అత్యధికంగా మూడున్నర లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చిందని ఆఫీసర్లు లెక్కలేశారు. ఎగువన వర్షాలకు తోడు ఖమ్మంలో కూడా భారీ వర్షంతో ఇంతపెద్ద యెత్తున వరద వచ్చింది. దీంతో 20 కాలనీలు, 10కి పైగా గ్రామాల్లోని 2 వేల మంది వరద కారణంగా ఇబ్బందిపడ్డారు.

.గతేడాది వరదల్లో జిల్లా వ్యాప్తంగా ఆరుగురు చనిపోయారు. కాగా, గత రెండు మూడ్రోజులుగా ఉమ్మడి వరంగల్ లో భారీ వర్షాలు పడుతుండడానికి తోడు, గురువారం ఖమ్మంలో కూడా భారీ వర్షం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో జిల్లా అధికారులు అన్ని విధాలుగా అప్రమత్తమయ్యారు. ఖమ్మం నగరంలోని 12 డివిజన్లతో పాటు, ఎదులాపురం మున్సిపాలిటీలోని 12 వార్డులను ముంపునకు గురయ్యేవిగా గుర్తించారు. వాటికి సెక్టోరల్ ఆఫీసర్లు, వార్డు ఆఫీసర్స్​, ఫీల్డ్ ఆఫీసర్లతో టీమ్​ లను ఏర్పాటుచేశారు.

ప్రత్యేకంగా వాట్సప్​ గ్రూపులను ఏర్పాటుచేసి సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఖమ్మం కలెక్టరేట్, మున్సిపల్ కార్పొరేషన్​, ఏదులాపురం మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటుచేశారు. వరద ఎక్కువ వస్తే ముంపు ప్రాంత వాసులను తరలించేందుకు 11 రిలీఫ్​ క్యాంప్​ లు, వారికి అవసరమైన బెడ్​ షీట్లు కూడా సిద్ధం చేశారు. ఎన్డీఆర్ఎఫ్​ టీమ్​ లను, బోట్ లను అందుబాటులో 
ఉంచారు. 

సన్నాహక చర్యలపై సమీక్ష.. 

ఇటీవల పలుమార్లు వరద సన్నాహక చర్యలపై జిల్లా కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. 300 మందికి పైగా యువతీ యువకులను ఆపదమిత్రలుగా ఎంపిక చేసి, వారికి ఎన్డీఆర్ఎఫ్​ సిబ్బందితో శిక్షణ ఇప్పించారు. చెరువులు, వాగుల వద్ద పెట్రోలింగ్ ను ఏర్పాటుచేశారు. జిల్లాలో మొత్తం 1,061 చెరువులు, కుంటలకు గాను 257 అలుగు పారుతుండగా, మరో 233 చెరువులు 90 నుంచి 100 శాతం వరకు నిండాయి. 75 శాతం నుంచి 90 శాతం వరకు 214, 50 నుంచి 75 శాతం వరకు 167, మరో 190 చెరువుల్లోకి 50 శాతం లోపు నీళ్లు చేరాయి.

పాలేరు, వైరా రిజర్వాయర్లు​ మత్తడి దుంకుతుండగా, లంకాసాగర్​ ప్రాజెక్టు సామర్థ్యం 16 ఫీట్లకు గాను 12.07 అడుగులకు నీటిమట్టం చేరింది. మున్నేరులో ప్రస్తుతం 9.5 అడుగుల దగ్గర స్థిరంగా వరద ప్రవాహం ఉందని, 16 అడుగులకు పైకి వరద వచ్చే వరకు మున్నేరుతో ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు.