చిన్న పిల్లను.. పెళ్లి వద్దు..బాగా చదువుకుంటా

చిన్న పిల్లను.. పెళ్లి వద్దు..బాగా చదువుకుంటా

బాల్య వివాహాలు రద్దు చేసినా..ఇంకా ఎక్కడో అక్కడ గుట్టు చప్పుడు కాకుండా జరిపిస్తూనే ఉన్నారు కొందరు తల్లిదండ్రులు. పిల్లలకు ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా పెళ్లిల్లు చేయిస్తున్నారు. దీంతో చిన్నవయసులోనే పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ఓ తండాకు చెందిన 14 ఏళ్ల బాలిక పెళ్లికి నిరాకరించడంతో పాటు..అధికారులకు తెలియజేయడంతో పెళ్లిని అడ్డుకున్నారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట శివారు గార్లగడ్డ తండాకు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలికతో వరంగల్‌ అర్బన్‌ జిల్లా వాసి, ఇప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకున్న 30 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయడానికి పెద్దమనుషులు నిర్ణయించారు. అయితే తాను చన్నపిల్లనని..తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. ఉన్నత చదువులు చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఉందని తల్లిదండ్రులను వేడుకుంది. అయినా విన్పించుకోకుండా .. పెద్దమనుషులు ఎంగేజ్మెంట్ నిర్వహించారు.

దీంతో ఆ బాలిక తన స్నేహితురాలితో చైల్డ్ లైన్‌కు సంబంధించి 1098 ఫోన్‌ చేయమని చెప్పింది. ఇదే విషయాన్ని స్థానిక MPTC వీరన్న కూడా బాలల సంరక్షణ అధికారులకు తెలియజేశారు. ఇది తెలుసుకున్న పెద్దమనుషులు నిన్న(బుధవారం) బాలిక అమ్మమ్మ గ్రామమైన గీసుకొండ మండలంలోని నందనాయక్‌ తండాలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి జరిపించడానికి రెడీ అవుతుండగా.. బాలల పరిరక్షణ విభాగం అధికారులు పెళ్లిని అడ్డుకున్నారు.