ఆటో అన్నకు ఆసరా కావాలె : అసిస్టెంట్ ప్రొఫెసర్ చిట్టెడ్డి కృష్ణారెడ్డి

ఆటో అన్నకు ఆసరా కావాలె : అసిస్టెంట్ ప్రొఫెసర్ చిట్టెడ్డి కృష్ణారెడ్డి

తెలంగాణ రాష్ట్ర రవాణా నెట్‌‌వర్క్‌‌లో ఆటోల పాత్ర కీలకం.  రాష్ట్రంలో స్వయం ఉపాధి పొందుతున్న ఆటోడ్రైవర్లతోపాటు వారి కుటుంబాలు నేడు ఆర్థిక భారంతో సతమతం అవుతున్నాయి.  రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో డ్రైవర్ పొద్దున లేచింది మొదలు ఏ గల్లీలో  ప్రయాణికులు దొరుకుతారా అని ఆశతో ఎదురు చూస్తూంటాడు. పేదరికాన్ని ధైర్యంగా ఎదిరించే ఆటో అన్న ఇరుకు సందుల్లోకి సైతం చొచ్చుకొనిపోయి  ప్రయాణికులను ఇంటికి చేరుస్తాడు.

ఇంధన ధరలతో సవాల్​

పెరుగుతున్న ఇంధన ధరలు ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా సవాలును విసురుతున్నాయి. దీంతో ఆటోవాలాలు స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించడం కష్టతరంగా మారింది. ఇంధన సబ్సిడీల ద్వారా ఈ ఆర్థిక భారాన్ని తగ్గించాలి. కనీస ఆదాయం కూడా రాక ఆటోవాలాలు ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్నారు. ఆటో యజమానులకు పెరిగిన టాక్స్, ట్రాఫిక్ చలాన్లు,  ఆటోలు కొనుక్కోవడానికి సరైన బ్యాంకు సదుపాయం అందుబాటులో లేకపోవడం,  ప్రైవేటు వ్యక్తుల నుంచి రుణాలను పొంది అధిక వడ్డీ భారంతో సతమతమవుతున్నారు. రాత్రింబగళ్లు కష్టపడినా ఆర్థిక పరిస్థితిలో మెరుగైన ఫలితాలు కనిపించకపోవడంతో  వారి కుటుంబాలు పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి.

వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు

ఆటోడ్రైవర్లు తమకు సొంత ఆటో లేకపోయినా, వాటిని అద్దెకి తీసుకొని జీవనోపాధి పొందుతున్నారు.    ప్రభుత్వ ఆర్థిక సంస్థలు కూడా వారికి రుణాలు అందించడానికి వెనుకాడుతున్నాయి. . ఆటో డ్రైవర్లు తరుచుగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆటో డ్రైవర్లు ఎక్కువగా దుమ్ము, ధూళి, శబ్ద కాలుష్య వాతావరణంలో  గడుపుతారు. ఆటో డ్రైవర్లకు కూడా ఈఎస్ఐ ఫెసిలిటీని అమలు చేసినట్లయితే వారికి కొంత ఆరోగ్య భద్రత లభిస్తుంది.  

రైడ్-షేరింగ్ యాప్‌‌ల నుంచి పోటీ

రైడ్-షేరింగ్ యాప్‌‌లు రవాణా రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేశాయి. సంప్రదాయ ఆటో రిక్షా డ్రైవర్లు యాప్- ఆధారిత సేవలు నుంచి పోటీని ఎదుర్కొంటున్నారు.  ఓలా, ఉబర్ లాంటి బడాసంస్థల ప్రవేశంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  వీటికి తోడు రాపిడో పేరుతో ద్విచక్ర కిరాయి వాహనాల సదుపాయం ఆటో డ్రైవర్లకు గుదిబండగా మారింది. పట్టణాల్లో నడిపే ఆటోలకు పర్మిట్ పేరుతో భారీగా వసూలు చేసే పన్నులు భారంగా మారాయి. అస్తవ్యస్తమైన రోడ్లపై  ప్రమాదాలకు గురవుతున్న ఆటో డ్రైవర్లను భద్రతా సమస్యలు చుట్టుముడుతున్నాయి.

‘మహాలక్ష్మి’తో కష్టాలు

అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆటో డ్రైవర్లకు మూలిగే నక్క మీద తాటి పండు పడినట్టు ‘మహాలక్ష్మి’ పథకం వారి పాలిట భారంగా మారింది. కాంగ్రెస్​ ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో గిరాకీ లేక అనేక ప్రాంతాలలో ఆటోడ్రైవర్లు ఆందోళనకు దిగుతున్నారు. పట్టణ ప్రాంతాలలో ఆటోలకి ఎంతో కొంత డిమాండ్ ఉండగా గ్రామీణ ప్రాంతాలలో మహాలక్ష్మి పథకం వల్ల ఆటోలతో ఉపాధి పొందుతున్నవారికి ఎక్కువ నష్టం జరుగుతోంది. బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళ సాధికారత, అభివృద్ధికి ఉపయోగపడుతుందనేది వాస్తవమే. కానీ, ఆటో డ్రైవర్లు ఈ పథకం కారణంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు.  బతుకుతెరువు  ముందు ముందు ఎట్లా ఉండబోతుందనే భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో  ప్రభుత్వం నగదు సాయం, వడ్డీ లేని రుణాలు అందిస్తూ వారికి కొంత ఊరట కల్పించాల్సిన అవసరం ఉంది.

కొత్త ప్రభుత్వంపై కొండంత ఆశ

భారీ సంక్షేమ హామీలతో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం తమను ఆదుకుంటుందని ఆటో డ్రైవర్లు సైతం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ సింగిల్ పర్మిట్ విధానం తీసుకురావడంతోపాటు,  పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను 50 శాతం డిస్కౌంటుతో వన్ టైమ్ సెటిల్మెంటు, ఆటోడ్రైవర్‌‌కు  రూ.12,000 ఇస్తామని ప్రకటించారు. ఈ హామీల అమలుతో పాటు ఆరోగ్య బీమా, వడ్డీలేని రుణాలు, కనీస వసతులతో ఆటోస్టాండ్లు ఏర్పాటు, పర్మిట్లు ప్రక్రియ సులభతరం చేసి సర్కారు ఆదుకుంటే లక్షల కుటుంబాల కష్టాలు ఊరట పొందుతాయి. మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించే బీమా పథకాన్ని అమల్లోకి తేవాలి. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తే.. తెలంగాణలో రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుంది.

- చిట్టెడ్డి కృష్ణారెడ్డి,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
హెచ్​సీయూ