దారుణం : కిరాయి అడిగినందుకు ఆటో డ్రైవర్ హత్య

దారుణం : కిరాయి అడిగినందుకు ఆటో డ్రైవర్ హత్య

హైదరాబాద్ : సౌత్ జోన్ పరిధిలో జరిగిన హత్య కేసును చేధించామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. మే 1వ తేదీన.. పహాడీ షరీఫ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించామనీ… ఆ డెడ్ బాడీపై కత్తిపోట్లు గుర్తించి దర్యాప్తు చేశామని చెప్పారు సీపీ.

మొత్తం 38 కిలోమీటర్ల పరిధిలోని సీసీ టీవీ ఫుటేజ్ మానిటర్ చేసి… ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు సీపీ అంజనీ కుమార్. ఇస్మాయిల్, అమీర్, అలీ ఖాన్, అబ్దుల్ సమీతో పాటు మరో బాలుడు హత్య లో పాల్గొన్నారని చెప్పారు.

సీపీ చెప్పిన కథనం ప్రకారం… ఐదుగురు పోకిరీలు అంతా కలిసి … కిరాయికి ఆటో తీసుకుని రాజేంద్ర నగర్ చింతల్ బస్తీకి వెళ్లారు. ఆటో డ్రైవర్ కిరాయి డబ్బులు అడగడంతో.. గొడవ మొదలైంది. మాటా మాటా పెరిగి… ఆటో డ్రైవర్ దగ్గరున్న డబ్బులు లాక్కునేందుకు ఐదుగురు నిందితులు ప్రయత్నించారు. వారిని డ్రైవర్ అడ్డుకున్నాడు. ఈ గొడవ మరింత పెరిగి… ఆటో డ్రైవర్ ను దారుణంగా పొడిచి చంపేశారు నిందితులు. హత్య ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత.. సైబరాబాద్ పరిధిలో మృతుడి ఆటోను దగ్ధం చేశారు.