ఆటో మీటర్ చార్జీలు పెంచండి .. ఆటో యూనియన్ నేతల డిమాండ్

ఆటో మీటర్ చార్జీలు పెంచండి .. ఆటో యూనియన్ నేతల డిమాండ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గ్రేటర్​లో పన్నెండేండ్ల నుంచి ఆటో మీటర్​చార్జీలు పెంచలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో చార్జీలను పెంచాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్​యూనియన్​జాయింట్​యాక్షన్ కమిటీ డిమాండ్​చేసింది. గురువారం ఆర్టీఏ జాయింట్​కమిషనర్​ రమేశ్​కు యూనియన్​నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు బి.వెంకటేశం, ఎంఎ సలీం, ఎ.సత్తిరెడ్డి, మారయ్య, ప్రవీణ్​, మల్లేశ్​గౌడ్​, శ్రీకాంత్​మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్, డీజిల్, ఆయిల్, గ్యాస్​నిత్యవసర ధరలకు అనుగుణంగా ఆటో చార్జీలను కూడా పెంచే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 

చార్జీలను పెంచకపోవడం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్ర్కాప్​ పాలసీని పాతపద్దతిలోనే కొనసాగించాలని, ఓఆర్ఆర్​పరిధిలో 20 వేల ఆటోలకు వెంటనే పర్మిట్లు ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు సంత్సరానికి 12వేల సాయం అందించాలని కోరారు. ఆటో, రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఓలా, ఊబర్, రాపిడో యాప్​లను నిషేధించి కొత్త యాప్​ను అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు.