పండగ సమయంలో మస్తు సేల్స్​..ఆటో అమ్మకాలు అదుర్స్​

పండగ సమయంలో మస్తు సేల్స్​..ఆటో అమ్మకాలు అదుర్స్​

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం పండుగ సీజన్‌‌లో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. బలమైన డిమాండ్ కారణంగా దేశవ్యాప్తంగా సేల్స్​ దూసుకెళ్లాయి. ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాల్లో ఇవి రికార్డు స్థాయిలో పెరిగాయని డీలర్ల సమాఖ్య ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా)  మంగళవారం తెలిపింది.   గత ఏడాది 31,95,213 యూనిట్ల తో పోలిస్తే ఈ ఏడాది 42 రోజుల పండుగ కాలంలో మొత్తం ఆటోమొబైల్ అమ్మకాలు 19 శాతం పెరిగి 37,93,584 యూనిట్లకు చేరుకున్నాయి. నవరాత్రి మొదటి రోజు నుంచి ధన్‌‌తేరస్ వరకు ప్యాసింజర్ వెహికల్​ రిటైల్ విక్రయాలు 5,47,246 యూనిట్లకు పెరిగాయి.

గత ఏడాది ఇదే కాలంలో 4,96,047 యూనిట్లు అమ్ముడయ్యాయి. "నవరాత్రి సమయంలో, ముఖ్యంగా ప్యాసింజర్ వెహికల్స్​ అమ్మకాల్లో ప్రారంభంలో బలహీనమైన పనితీరు ఉన్నప్పటికీ, దీపావళి నాటికి పరిస్థితి మెరుగుపడింది. 10 % వృద్ధి రేటుతో ముగిసింది" అని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. పండుగ కాలంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్​కు బాగా డిమాండ్​ కనిపించిందని ఆయన తెలిపారు. అయితే ఓఈఎంలు భారీగా స్టాకు ను పంపించడం వల్ల ప్యాసింజర్​ వెహికల్స్​ఇన్వెంటరీ పేరుకుపోయిందని చెప్పారు. ఇది ఆల్-టైమ్ హై లెవెల్స్‌‌కు సమీపంలో ఉందని సింఘానియా పేర్కొన్నారు.

భారీగా పెరిగిన టూవీలర్ల అమ్మకాలు

టూవీలర్ల రిజిస్ట్రేషన్లు 2022లో 23,96,665 యూనిట్ల నుంచి ఈ ఏడాది 21 శాతం పెరిగి 28,93,107 యూనిట్లకు చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వీటికి విపరీతంగా డిమాండ్​కనిపించింది. దీంతో పలు విభాగాల్లో రికార్డు స్థాయి విక్రయాలు నమోదయ్యాయి. ఈ 42 రోజుల విండోలో కమర్షియల్​ వెహికల్స్​ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగి 1,23,784 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీవీలర్ల రిజిస్ట్రేషన్లు 41 శాతం పెరిగి 1,42,875 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ల విక్రయాలు గతేడాది పండుగ కాలంలో 86,951 యూనిట్ల నుంచి ఈసారి 86,572 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. నవరాత్రి సమయంలో ట్రాక్టర్ల అమ్మకాలు 0.5 శాతం మాత్రమే తగ్గాయని  సింఘానియా వివరించారు.

ఈ సంవత్సరం పండుగ కాలం అక్టోబరు 15న ప్రారంభమై నవంబర్ 25న ముగిసింది. గత ఏడాది సెప్టెంబర్ 26  నవంబర్ 6 మధ్య ఫెస్టివల్​ సీజన్​ జరిగింది. దేశవ్యాప్తంగా 1,442 ఆర్​టీఓ ఆఫీసుల్లో 1,355 ఆఫీసుల నుంచి వెహికల్స్​ రిజిస్ట్రేషన్ డేటాతో ఈ సమాచారాన్ని అందిస్తున్నట్టు ఫాడా తెలిపింది. ఫాడా భారతదేశం అంతటా 30 వేల కంటే ఎక్కువ డీలర్‌‌షిప్ అవుట్‌‌లెట్లు గల 15 వేల ఆటోమొబైల్ డీలర్‌‌షిప్‌‌లకు ప్రాతినిధ్యం వహిస్తోంది.